సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా.. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్..‘దర్బార్’ ఆడియో విడుదల..
సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా.. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్..‘దర్బార్’.. సునీల్ శెట్టి, నివేదా ధామస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. శనివారం అనిరుద్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ చెన్నైలో జరిగింది.
ఈ కార్యక్రమంలో సూపర్‌స్టార్ రజినీ కాంత్ మాట్లాడుతూ : ‘‘ఈ చిత్ర నిర్మాత సుభాస్కరన్ నాకు మంచి స్నేహితుడు. తనొక సినిమా ప్రొడ్యుసర్‌గానే మనకు తెలుసు. కానీ తను లండన్‌లో పెద్ద బిజినెస్ మేన్. ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. సమాజానికి సేవ చేస్తున్నాడు. తన నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో నేను ‘2.0’ సినిమా చేసే సమయంలో మా బ్యానర్‌లో మరో సినిమా చేయాలని ఆయన నన్ను అడిగడంతో నేను సరేనన్నాను. ఈ సినిమాలో నన్ను డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరు? అని ఆలోచించినప్పుడు నాకు మురుగదాస్ గారు ఆలోచనలోకి వచ్చారు. ఆయన డైరెక్ట్ చేసిన ‘రమణ’, ‘గజినీ’ చిత్రాలు నాకు బాగా నచ్చాయి.. అప్పుడే ఆయనతో సినిమా చేయాలనుకున్నాను ఆయన కూడా సరేనన్నారు.
కొన్ని పరిస్థితుల కారణంగా సినిమా చేయడానికి వీలు కాలేదు. ‘కబాలి’, ‘కాలా’ సినిమాలు చేసే సమయంలో ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కథతో సినిమా చేస్తానన్నాడు మురుగదాస్. అయితే ‘పేట’ చిత్రంలో నన్ను చూసి మీరు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తారని తెలిసి ఉంటే నేను అద్భుతమైన సినిమా చేసేవాడిని కదా! అని ఒక వారంలోనే ‘దర్బార్’ కథతో నా దగ్గరకు వచ్చాడు. అలా ప్రారంభమైందీ చిత్రం. సస్పెన్స్‌తోపాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందింది. చాలా రోజుల తర్వాత శంకర్‌లా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు మెసేజ్ ఇచ్చే సినిమాలు చేసే దర్శకుడు మురుగదాస్‌తో పనిచేయం ఆనందంగా అనిపించింది.
అలాగే సినిమాటోగ్రాఫర్ సంతోశ్ శివన్‌తో ‘దళపతి’ తర్వాత 29 ఏళ్లకు కలిసి పనిచేసిన సినిమా. అలాగే నయనతార ఈ సినిమాలో నటించింది. తను ‘చంద్రముఖి’లో తొలిసారి నాతో నటించింది. ఈ సినిమాలో చంద్రముఖి కంటే గ్లామర్‌గా ఎనర్జిటిక్‌గా కనపడుతుంది. అలాగే సునీల్ శెట్టి, యోగిబాబు, నివేదా థామస్ ఇలా అందరూ చాలా మంచి పాత్రలు చేశారు. రామ్ లక్ష్మణ్ అద్భుతమైన ఫైట్స్ కంపోజ్ చేశారు. అలాగే క్లైమాక్స్ ఫైట్‌ను పీటర్ హెయిన్స్‌గారు కంపోజ్ చేశారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా ఇది. వర్షాల కారణంగా సినిమా షెడ్యూల్ ఆలస్యమైంది. అయితే ఈ సినిమాను మురుగదాస్ 90 రోజుల్లోనే పూర్తి చేశారు. ఆయన కాకుండా మరెవరున్నా ఈ సినిమాను అంత క్వాలిటీగా, త్వరగా పూర్తి చేయలేరు.
అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ‘పేట’ కంటే ఈ సినిమాలో పాటలు బావున్నాయి. సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్స్‌లో ఇళయరాజా గారు సన్నివేశాలను స్క్రిప్ట్ పరంగా డెవలప్ చేసి.. వాటికి సంగీతంతో ప్రాణం పోస్తారు. ఆ తర్వాత అలాంటి సెన్స్ నేను అనిరుద్‌లోనే చూశాను. మంచి వ్యక్తులు అందరూ మంచి మనసుతో మంచి సమయంలో కలిసి చేసిన సినిమా ఇది కాబట్టి మంచి సమయంలోనే రిలీజ్ అవుతుంది.
నేను తమిళనాడుకి వచ్చేటప్పుడు నాపై నమ్మకంతో నన్ను ఇక్కడ అడుగు పెట్టించిన వారి నుండి, నాపై నమ్మకంతో సినిమాలు రూపొందించిన దర్శక, నిర్మాతలు అందరి నమ్మకాన్ని నేను వమ్ము చేయలేదు. ఇప్పుడు ‘దర్బార్’తో మీ నమ్మకాన్ని వమ్ము చేయను. డిసెంబర్ 12న నా పుట్టిన రోజు. ఆరోజు నేను పెద్దగా సెలబ్రేట్ చేసుకోననే సంగతి తెలిసిందే. అభిమానులు కూడా ఆ రోజున గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయవద్దు. ఆ డబ్బులతో పేదలకు అనాథలకు సాయం చేయాలని కోరుతున్నాను’’ అన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ‘దర్బార్’ తమిళ్, తెలుగులో భారీగా విడుదలవుతోంది.