కోలుకో తలైవా.. రజనీ ఆరోగ్యంపై అభిమానుల్లో టెన్షన్..!

Superstar Rajinikanth Health : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు చికిత్స కొనసాగుతోంది. ఆయనకు బీపీ కంట్రోల్‌ చేసేందుకు అపోలో వైద్యులు ప్రయత్నం చేస్తున్నారు. రజనీ ఆరోగ్యంపై శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌ను ఆస్పత్రి వర్గాలు విడుదల చేశాయి. ఆయనకు కరోనా లక్షణాలేవీ కనిపించలేదని, బీపీ సమస్య తప్ప ఇతర ఏ ఇబ్బందులు లేవని స్పష్టం చేశాయి. ప్రస్తుతానికి రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రత్యేక వైద్య బృందం ఆయన్ను పర్యవేక్షిస్తోందని పేర్కొన్నాయి. ఇక ఇవాళ మరికొన్ని వైద్య పరీక్షలు చేస్తామన్న ఆస్పత్రి వర్గాలు….రక్తపోటు అదుపులోకి రాగానే రజనీకాంత్‌ను డిశ్చార్జి చేస్తామని వెల్లడించాయి.

సూపర్ స్టార్ రజనీకాంత్‌ అస్వస్థతకు గురికావడం అభిమానులను టెన్షన్‌ పెట్టింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటు చెన్నై నుంచి రజనీ వ్యక్తిగత వైద్యులు కూడా హైదరాబాద్ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గవర్నర్‌ తమిళిసై కూడా అపోలో వైద్యులతో మాట్లాడారు. ఇక.. రజనీ ఆరోగ్యంపై చిరంజీవి, మోహన్‌బాబు ఆరా తీశారు. కుటుంబసభ్యులకు ఫోన్లు చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తమిళ తలైవా రజనీకాంత్‌కు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన హెల్త్‌ కండీషన్‌ నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రజనీకి బ్లడ్‌ ప్రెషర్‌ పెరగడంతో ఇంటర్నేషనల్‌ స్యూట్‌లో వైద్యం అందిస్తున్నారు. మరోవైపు చెన్నై నుంచి వచ్చిన రజనీకాంత్‌ వ్యక్తిగత వైద్యులు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ కొత్త సినిమా అన్నాత్తే షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ వచ్చారు. ప్రొడక్షన్‌ సిబ్బందిలో 8 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ నెల 22న రజనీకాంత్‌కు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్‌ వచ్చిందని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయనకు రక్తపోటు తప్ప ఇతర ఏ సమస్యలూ లేవన్నారు. బీపీ అదుపులోకి రాగానే రజనీకాంత్‌ను డిశ్చార్జ్‌ చేస్తామన్నారు.

రజనీకాంత్‌ ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్న ఆయన కుమార్తె ఐశ్యర్య హుటాహుటిన హైదరాబాద్‌ చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడారు. అయితే సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నందున కుమార్తె ఐశ్వర్యను కూడా రూమ్‌లో ఉండొద్దని రజనీకాంత్ చెప్పినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ గవర్నర్ తమిళి సై.. రజనీకాంత్ ఆరోగ్యంపై ఆరా తీశారు. వైద్యులకు ఫోన్‌ చేసి హెల్త్‌ కండీషన్‌ తెలుసుకున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సూపర్‌ స్టార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.