R Parthiban : మొన్న కులం గురించి మాట్లాడి వార్తల్లో.. ఇవాళ కులం వద్దని వైరల్..
తమిళ నటుడు, దర్శకుడు పార్తిబన్ ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ గా నటించాడు. (R Parthiban)
- Saketh U
- Published on- April 21, 2026 / 01:44 PM IST
R Parthiban
R Parthiban : తమిళ నటుడు, దర్శకుడు పార్తిబన్ ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పార్తిబన్ మాట్లాడుతూ తన ఫ్యామిలీకి ఆంధ్రాలో మూలాలున్నాయని, తన కులం గురించి చెప్పాడు. అయితే పార్తిబన్ తప్పుగా ఏమి మాట్లాడకపోయినా కొంతమంది తమిళులు ఆంధ్రకు వెళ్లి అక్కడ కులం గురించి మాట్లాడటం ఏంటి అంటూ ఆయన్ని విమర్శించారు.
అప్పుడే దానిపై పార్తిబన్ క్షమాపణ చెప్పారు. అయితే ఇటీవల పార్తిబన్ ‘నో కాస్ట్ – నో రిలీజియన్ సర్టిఫికెట్’ పొందాలనుకొని కోర్టులో పిటిషన్ వేయగా తాజాగా కోర్టు దీనిని విచారించి ఏప్రిల్ 29లోపు తనకు ఏ కులం, మతం లేదు అనే సర్టిఫికెట్‌ను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.
Also Read : Aishwarya Rai : పెళ్లి రోజు స్పెషల్.. భర్త, కూతురుతో స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన ఐశ్వర్య రాయ్..
ఈ సందర్భంగా పార్తిబన్ మీడియాతో మాట్లాడుతూ.. కోర్టు తీర్పు నాకు సంతోషం ఇచ్చింది. కులమతాలపై నాకు ఆసక్తి లేదు. ఇటీవల నేను ఓ కార్యక్రమంలో పొరపాటున కులం పేరు ప్రస్తావించాను. ఆ మాట చాలామందిని బాధపెట్టింది. నేను కూడా అలా మాట్లాడినందుకు బాధపడ్డాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఏ కులానికి, మతానికి చెందనివాడిని కాదు అని తెలిపే సర్టిఫికెట్ పొందాలని పిటిషన్ వేశాను. కులమతాలు లేని కొత్త సమాజం సృష్టించే దిశగా నేను వేస్తున్న మొదటి అడుగు ఇది.
కానీ ఒక సామాన్యుడు ఇలాంటి సర్టిఫికెట్ కావాలంటే దానికోసం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది. ఈ సర్టిఫికెట్ వచ్చే ప్రక్రియ మరింత సులభంగా ఉండాలి. అలాగే కులంతో వచ్చే ఎలాంటి ప్రయోజనాలను కూడా నేను కోరుకోవడం లేదు. కష్టపడి పైకి రావడమే నాకు ఇష్టం అని తెలిపారు. దీంతో పార్తిబన్ మరోసారి వార్తల్లో నిలిచారు.
