Site icon 10TV Telugu

Viral News: వధూవరులకు పెట్రోల్ కానుకిచ్చిన తమిళ కమెడియన్!

Viral News

Viral News

Viral News: దేశంలో పెట్రోల్ మోత గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మొదలైన పెట్రోల్ ధరల పెరుగుదల సెంచరీ దాటినా ఆగడం లేదు. ప్రస్తుతం రాష్ట్రాన్ని బట్టి రూ.110 వరకు పెట్రోల్.. వందకు చేరువలో డీజిల్ కొనసాగుతుంది. దీంతో దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు ఇది పెను భారంగా మారింది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతుండగా.. కొందరు ఇదే విషయంపై వినూత్న నిరసనలు తెలుపుతున్నారు.

తాజాగా తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హాస్య నటుడు మయీల్‌ సామి పెట్రోల్‌ ధరల పెరుగుదలపై ఓ వినూత్న నిరసన తెలిపాడు. ఓ పెళ్ళికి హాజరైన మాయీల్ సామి నవ దంపతుల వద్దకు వెళ్లి ఓ కవర్‌ తీసి రెండు పెట్రోల్ డబ్బాలు పెళ్లి కానుకగా ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా వధూవరులతో పాటు బంధుమిత్రులు ముందు షాకవగా.. అనంతరం నవ్వుకున్నారు. కమెడియన్ వధూవరులకు పెట్రోల్ కానుక ఇచ్చిన ఈ ఫొటోలను తమిళ కాలమిస్ట్‌ మనోబాల విజయబాలన్‌ ట్వీట్‌ చేశారు.

ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారగా.. మయీల్‌ సామి చర్యను అందరూ అభినందిస్తున్నారు. మండుతున్న పెట్రోల్‌ ధరలపై ఇదో వింత నిరసన అని కామెంట్లు చేస్తున్నారు. సినిమాలతో పాటు రాజకీయాలతో కూడా పరిచయమున్న మాయీల్ సామి గతంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోగా.. దివంగత నేతలు ఎంజీఆర్, జయలలితకు అభిమాని. ప్రస్తుతం స్టాలిన్ పాలనపై కూడా సానుకూలంగానే మాట్లాడారు. స్టాలిన్ పెట్రోల్ ధరను రూ.3 తగ్గించడంపై హర్షం వ్యక్తం చేస్తూనే దేశంలో పెట్రోల్ ధరలపై వినూత్న నిరసన తెలిపాడు.

Exit mobile version