Taraka Ratna's funeral is over
Tarakaratna : గత కొంత కాలంగా నందమూరి కుటుంబంలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు, అతని చిన్న కుమారుడు హరిం చక్రవర్తి, ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ, హరికృష్ణ, కుమార్తె ఉమామహేశ్వరి, హరికృష్ణ కుమారుడు జానకిరామ్, ఇప్పుడు తారకరత్న.. ఇలా ఒకరి తరువాత ఒకరు చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత నెలలో గుండెపోటుకు గురైన తారకరత్న బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ వచ్చారు.
అప్పటి నుంచి వెంటిలేటర్ పై అత్యవసర చికిత్స అందిస్తూ వచ్చారు వైద్యులు. దాదాపు 22 రోజులు పాటు పోరాడిన తారకరత్న శనివారం(ఫిబ్రవరి 18)న రాత్రి కన్నుమూశారు. శనివారం నాడు హైదరాబాద్ దగ్గర్లోని మోకిలలోని తారకరత్న స్వగృహం వద్ద ఆయన భౌతికకాయం ప్రముఖుల సందర్శనార్థం ఉంచారు. ఈరోజు ఉదయం అభిమానుల సందర్శనార్థం కోసం తారకరత్న భౌతికకాయం ఫిలింఛాంబర్ కి తరలించగా, మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉంచారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించేందుకు మహాప్రస్థానానికి అంతిమయాత్రగా తీసుకువెళ్లారు.
ఈ అంతిమయాత్రలో కుటుంబ సభ్యులతో పాటు, అభిమానులు కూడా పాల్గొని.. జోహార్ తారకరత్న అంటూ మహాప్రస్థానం వరకు తరలి వచ్చారు. అంత్యక్రియలు అన్ని బాలకృష్ణ దగ్గర ఉండి చూసుకున్నాడు. మహాప్రస్థానానికి చంద్రబాబు నాయుడు, విజయ్ సాయి రెడ్డి, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వచ్చారు. ఇక హిందూ సాంప్రదాయాలు మధ్య తారకరత్నకు అంత్యక్రియలు నిర్వహించారు. తారకరత్న తండ్రి తలకొరివి పెట్టడంతో అంత్యక్రియలు ముగిశాయి.