Tarakaratna movie career and his record in film industry
Tarakaratna : గత కొంతకాలంగా పలువురు సినీ ప్రముఖులు మారాయిస్తూ తెలుగు సినీ పరిశ్రమని విషాదంలో ముంచేశారు. తాజాగా తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. నటుడు నందమూరి తారకరత్న బెంగుళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ శనివారం రాత్రి కన్నుమూశారు. దీంతో మరోసారి సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న మృతిపై సంతాపం తెలియచేస్తున్నారు.
ఎన్టీఆర్ మనవడిగా, నందమూరి మోహన కృష్ణ కుమారుడిగా తారకరత్న 20 ఏళ్ళ వయసులోనే సినీ పరిశ్రమలోకి అరంగ్రేటం ఇచ్చాడు. మొదటి సినిమా 2002లో ఒకటో నంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు తెరకు తారకరత్న పరిచయమయ్యాడు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు కథ అందించి నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇండస్ట్రీకి నందమూరి ఫ్యామిలీ నుంచి మరో అద్భుతమైన నటుడు వచ్చాడని అంతా ప్రశంసించారు.
దీంతో సినీ పరిశ్రమలో ఎవ్వరూ చేయని సాహసం చేసి ఒకేసారి 9 సినిమాలని ప్రకటించి, వాటి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు తారకరత్న. అయితే అనుకోని కారణాల వల్ల అందులో కొన్ని సినిమాలు ఆగిపోయాయి. దీంతో ఒకేసారి 9 సినిమాలని ప్రకటించిన రికార్డు ఇప్పటికీ తారకరత్న పేరుమీదే ఉంది.
ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా తర్వాత యువరత్న అనే సినిమాతో వచ్చి ప్రేక్షకులని మెప్పించాడు తారకరత్న. ఈ సినిమా మోస్తరు విజయం సాధించింది. అనంతరం తారక్, భద్రాద్రి రాముడు, నో.. సినిమాలతో మెప్పించాడు. 2006 తర్వాత మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని 2009లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అమరావతి చిత్రంలో విలన్ గా నటించి మళ్లీ సినీ జీవితాన్ని మొదలుపెట్టాడు. ఈ సినిమాకి రాష్ట్రప్రభుత్వం నుంచి ఉత్తమ ప్రతినాయకుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు తారకరత్న. ఆ తర్వాత రాజా చెయ్యి వేస్తే అనే సినిమాలో కూడా ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు.
అనంతరం వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, విజేత, ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని, మహాభక్త సిరియాల, కాకతీయుడు, ఎవరు, మనమంత, ఖయ్యూంబాయ్, దేవినేని, ఎస్ 5 నో ఎగ్జిట్, సారథి.. లాంటి పలు సినిమాల్లో నటించాడు. ఇటీవలే కొన్ని నెలల క్రితం డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో 9 హావర్స్ అనే వెబ్ సిరీస్ లో హీరోగా పోలీసాఫీసర్ క్యారెక్టర్ లో నటించి మెప్పించాడు. ఈ సిరీస్ మంచి విజయం సాధించడంతో దీనికి పార్ట్ 2 కూడా గతంలోనే ప్రకటించారు.
Lokesh Padayatra : తారకరత్న మృతితో నారా లోకేష్ యువగళం పాదయాత్రకి బ్రేక్…
ఇలా అడపాదడపా సినిమాలు చేస్తూ ఇటీవలే మళ్ళీ సినీ కెరీర్ మీద ఫోకస్ చేస్తూ.. రాజకీయాల్లో కూడా యాక్టివ్ అవ్వాలని నారా లోకేష్ తో పాదయాత్రలో పాల్గొన్నారు తారకరత్న. కానీ దురదృష్టవశాత్తూ నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో మొదటి రోజే కుప్పంలో నడుస్తుండగా సడెన్ గా గుండెపోటు రావడంతో కింద పడిపోయారు తారకరత్న. కుప్పం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగుళూరుకు తరలించారు. గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న చికిత్స తీసుకుంటూ శనివారం రాత్రి మరణించారు. దీంతో సినీ పరిశ్రమతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా విషాదంలో మునిగిపోయారు.