Tollywood
Tollywood : తెలుగు సినీ పరిశ్రమలో మళ్ళీ సినీ కార్మికుల సమ్మె మొదలైంది. గతంలో సినీ కార్మికుల వేతనాలు ప్రతీ మూడేళ్లకోసారి 30% పెంచాలని ఓ ఒప్పందం జరగ్గా ఆ నిబంధన గత నెల జూన్ 30వ తేదీతో ముగిసింది. దాని గురించి ఫిల్మ్ ఛాంబర్ – తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య పలుమార్లు చర్చలు జరగ్గా అవి విఫలం అయ్యాయి.
ఫిల్మ్ ఛాంబర్ లో 5% మాత్రమే పెంచుతామని చెప్పారు. దీనిపై పలు చర్చలు జరిగిన అనంతరం ఫిలిం ఛాంబర్ ఒప్పుకోకపోవడంతో ఫెడరేషన్ ఓ సమావేశం నిర్వహించి నేడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అన్ని యూనియన్లకు ఓ లెటర్ విడుదల చేసింది.
ఈ లెటర్ లో ఫెడరేషన్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించింది. తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రకటించిన నిర్ణయాలు..
1. వేతనాలు పెంపు విషయం లో కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ లుగా సయ్యద్ హ్యూమయున్, వీరశంకర్ ని నియమించడం జరిగింది.
2. రేపటి నుండి (04-08-2025) 30% వేతనాలు పెంచి ఇవ్వాలని నిర్ణయించడమైనది.
3. రేపు ఉదయం అనగా 04-08-2025 సోమవారం నుండి 30% వేతనాలు ఇస్తామని, ప్రొడ్యూసర్ నుండి సంభందిత కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చిన వారికి మాత్రమే, సంభందిత లెటర్ ఫెడరేషన్ ద్వారా యూనియన్ లకు తెలియజేసిన తరువాత మాత్రమే షూటింగ్ లకు వెళ్లాలని నిర్ణయించడమైనది.
4. అప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కు సంబందించిన సభ్యులు ఎవరు కూడా సినిమాకు గాని, వెబ్ సిరీస్ ల షూటింగ్ లకు గాని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నుండి అనుమతి లేనిదే ఎటువంటి విధులకు యూనియన్ / అసోసియేషన్ సభ్యులు హాజరు కాకూడదని నిర్ణయించడమైనది.
ఈ రూల్స్ తెలుగు సినిమా ఎక్కడ జరిగినా వర్తించును. ఇతర బాషా చిత్రాలకు కూడా వర్తించును అని తెలిపారు.
Also Read : Kingdom : కేరళలో విజయ్ దేవరకొండ హవా.. ఏ హీరో సాధించలేని రికార్డ్ కింగ్డమ్ తో..
దీంతో టాలీవుడ్ లో రేపట్నుంచి షూటింగ్స్ జరగవని, అనధికార సమ్మె నడుస్తుందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం థియేటర్స్ కి జనాలు రాక, హిట్స్ లేక, సినిమా బడ్జెట్ లు పెరిగి నిర్మాతలకు గడ్డు కాలం నడుస్తుంది. ఇలాంటి సమయంలో కార్మికులు ఏకంగా 30 శాతం పెంచమనడంపై టాలీవుడ్ నిర్మాతలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు.