The Family Man
The Family Man: హాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ ల మాదిరి ఇప్పుడు మన దేశంలో కూడా వెబ్ సిరీస్ లకు ఒక క్రేజ్ దక్కింది. ఏకంగా కొన్ని సిరీస్ లకు ఒక బ్రాండ్ ఇమేజ్ దక్కుతుంది. అలాంటి బ్రాండ్ ఇమేజ్ దక్కించుకున్న సిరీస్ ఫ్యామిలీ మెన్. వెర్సటైల్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి జంటగా వచ్చిన ఫ్యామిలీ కమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మెన్’. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ఫిల్మ్‌ఫేర్స్ గెలుచుకుని మోస్ట్ వ్యూడ్ సిరీస్‌గా నిలిచి అటు నటులకు, దర్శక, నిర్మాతలను కూడా దేశమంతా తెలిసేలా చేసింది.
తొలి భాగం భారీ సక్సెస్ తో రెండో భాగాన్ని మరింత పగడ్బంధీగా ప్లాన్ చేసిన రాజ్ అండ్ డీకే ‘ది ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 కోసం తెలుగు స్టార్ హీరోయిన్ సమంత అక్కినేనిని తీసుకున్నారు. ఈ సిరీస్ తోనే సామ్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. సామ్ ఎంట్రీ అది కూడా నెగటివ్ పాత్ర అనగానే భారీ హైప్ వచ్చేసింది. అనుకున్నట్లుగానే ఫ్యామినీ మెన్ సిరీస్ రెండో భాగం తొలి భాగానికి మించి భారీ సక్సెస్ దక్కించుకుంది. ముందుగా హిందీలో ఆ తర్వాత తమిళ, తెలుగు బాషలలో విడుదలైన ఈ సిరీస్ అన్నిచోట్లా సక్సెస్ టాక్ తెచ్చుకుంది.
దీంతో ఇప్పుడు మూడవ భాగానికి సిద్ధమైంది. అయితే.. ఈ పార్టుతో మరో తెలుగు హీరో కూడా జత కానున్నాడు. ఔను.. యువహీరో సందీప్ కిషన్ కూడా ఫ్యామిలీ మెన్ మూడవ భాగంలో నటించనున్నాడు. సందీప్ కిషన్ నిర్మాణ భాగస్వామ్యంలో తెరకెక్కిన వివాహ భోజనంబు సినిమా ప్రమోషన్ లో సందీప్ దీన్ని అంగీకరించాడు. 12 ఏళ్లుగా కష్టాలు పడుతున్న తనకు ఇప్పుడిప్పుడే తగిన ఫలితం లభిస్తుందని.. ఫ్యామిలీ మెన్ 3 కూడా అందులో భాగమేనని చెప్పాడు. అయితే.. ఈ మూడవ భాగంలో కూడా సామ్ ఉంటుందా ఉండదా అన్నది తెలియలేదు.