The First Action Hero documentary won gaddar 2026 film award
Gaddar Awards: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో కరీంనగర్ కు చెందిన డాక్టర్ పొన్నం రవిచంద్ర డాక్యుమెంటరీ విభాగంలో పురస్కారాన్ని సాధించారు. ఈరోజు హైదరాబాదులో విలేకర్ల సమావేశంలో 2025 తెలుగు సినిమాల వివిధ విభాగాలకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. డాక్యుమెంటరీ విభాగానికి సంబంధించి బాలీవుడ్ లో 300కు పైగా సినిమాలలో నటించి, నిర్మించి దర్శకత్వం వహించిన పైడి జయరాజ్ జీవిత కథ ఆధారంగా వచ్చిన “ద ఫస్ట్ యాక్షన్ హీరో” డాక్యుమెంటరీ రెండవ అత్యుత్తమ డాక్యుమెంటరీగా అవార్డు(Gaddar Awards) గెలుచుకుంది.
Gaddar Awards: కొండా లక్ష్మణ్ బాపూజీ డాక్యుమెంటరీకి గద్దర్ అవార్డ్.. మేకర్స్ పై జ్యూరీ ప్రశంసలు
డాక్టర్ పొన్నం రవిచంద్ర ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించాడు. ఆయన సీనియర్ జర్నలిస్టు గా, కవిగా, రచయితగా, సినీ నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. కరీంనగర్ ఫిలిం భవన్ కు, కరీంనగర్ ఫిలిం సొసైటీ కి గత 8 ఏళ్ళ నుంచి అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. అలాగే, సినీ రంగ వికాసం కోసం, అత్యుత్తమ సినిమాల ప్రదర్శన ద్వారా యువతలో సినిమా కళ పట్ల ఆసక్తిని కలిగించే దిశగా కృషి చేస్తున్నారు. ఆ క్రమంలోనే పైడి జయరాజ్ గారి జీవితంపై ఆయన ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.
దీనికోసం, ముంబై వెళ్లి పైడి జయరాజ్ గారి వారసులను కలిసి అరుదైన ఫోటోగ్రాఫ్ లను, వీడియోలని సేకరించారు. ఈ డాక్యుమెంటరీ ద్వారా పైడి జయరాజ్ గురించిన ఎన్నెన్నో విశేషాలు వెలుగు లోకి వచ్చాయి. దాంతో, డాక్టర్ పొన్నం రవి చంద్రకు ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు రావడం ఆనందదాయకమని కరీంనగర్ జిల్లా కవులు, రచయితలు, సినిమా ప్రేమికులు నలిమెల భాస్కర్, పి ఎస్ రవీంద్ర, నగునూరి శేఖర్, గాజోజు నాగభూషణం, మాడిశెట్టి గోపాల్, అనంత చార్య,కూకట్ల తిరుపతి, కందుకూరి అంజయ్య, బూర్ల వెంకటేశ్వర్లు, లక్ష్మీ గౌతమ్, అనిల్ , వరాల మహేష్ , ముజఫర్, కోలా రామచంద్ర రెడ్డి, అశోక్ రావు, శుభాకాంక్షలు తెలిపారు.