The Girlfriend Review
The Girlfriend Review : రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా తెరకెక్కిన సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాణంలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు.
కథ విషయానికొస్తే.. భూమా(రష్మిక) హైదరాబాద్ లోని ఓ కాలేజీలో MA ఇంగ్లీష్ లిటరేచర్ జాయిన్ అవుతుంది. అదే కాలేజీలో విక్రమ్(దీక్షిత్ శెట్టి) MSc కంప్యూటర్స్ జాయిన్ అవుతాడు. కాలేజీ మొదటిరోజే ర్యాగింగ్ లో డ్యాన్స్ చేసి విక్రమ్ హీరో అవుతాడు. దీంతో విక్రమ్ ని దుర్గ(అను ఇమ్మాన్యుయేల్) ట్రై చేస్తూ ఉంటుంది. ఓ రోజు రాత్రి పూట రోడ్ మీద చిన్న యాక్సిడెంట్ విషయంలో మొదటిసారి భూమాని చూసి ప్రేమలో పడతాడు విక్రమ్. అప్పట్నుంచి తన వెనకే తిరిగి తనకు దగ్గరవుతాడు. ఓ రోజు విక్రమ్ రూమ్ కి సినిమా చూడటానికి వస్తుంది భూమా. ఆ సమయంలో ఇద్దరూ దగ్గరవుతారు.
అప్పట్నుంచి తనకు తెలియకుండానే భూమా విక్రమ్ ని ప్రేమిస్తున్నాను అని ఫీల్ అవుతుంది. మొదట్లో బాగున్నా విక్రమ్ తర్వాత భూమా నా ఒక్కదానికే, తను అబ్బాయిలతో మాట్లాడొద్దు, కాలేజీ ఈవెంట్స్ లో పాల్గొనద్దు అని చెప్తూ ఉంటాడు. ఇవన్నీ భూమాకు నచ్చకపోయినా ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. భూమా తన తండ్రికి ఇవన్నీ తెలిస్తే ఏమవుతుందో అని భయపడుతుంది. ఓ రోజు విక్రమ్ భూమాని తన తల్లి దగ్గరికి తీసుకెళ్తాడు. భూమా ఆమెని చూసి తన జీవితం కూడా ఇలాగే అయిపొతుందెమో అని ఫీల్ అవుతుంది. అసలు భూమా విక్రమ్ ని నిజంగా ప్రేమిస్తుందా? విక్రమ్ వద్దు అని భూమా చెప్పగలదా? విక్రమ్ తల్లిని చూసి భూమా ఎందుకు భయపడుతుంది? వీళ్ళ ప్రేమ భూమా తండ్రికి తెలుస్తుందా? మధ్యలో దుర్గ కథేంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : The Great Pre Wedding Show : ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ మూవీ రివ్యూ.. ఫుల్ గా నవ్వుకోవాల్సిందే..
టీజర్, ట్రైలర్స్ తో అసలు ఇది ఒక గొప్ప సినిమా, రష్మిక కెరీర్ నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్, అమ్మాయిల విషయంలో ఓ కొత్త పాయింట్ చూపిస్తున్నాం అని ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు. తీరా చూస్తే.. ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, అతనితో ఇబ్బంది పడుతున్న గర్ల్ ఫ్రెండ్ చివరికి అతన్ని ఎలా వదిలించుకుంది అనే రొటీన్ కథ. ఇప్పుడు అమ్మాయిలు అన్నిట్లోనూ దూసుకుపోతున్నారు. ఇంకా కొంతమంది దర్శకులు అప్పుడెప్పుడో అమ్మాయిలు బాధపడిన సంఘటనలని ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు.
ఈ సినిమాలో చూపించిన కాలేజీ రియల్ లైఫ్ లో ఎక్కడ ఉంటుందో దర్శకుడికే తెలియాలి. అమ్మాయిలు అబ్బాయిల హాస్టల్స్ కి, అబ్బాయిలు అమ్మాయిల హాస్టల్స్ కి ఎవరైనా ఎప్పుడైనా వెళ్లొచ్చు. రాత్రుళ్ళు ఉండొచ్చు. ఇలా ఏ కాలేజీలో ఉంటుందో. ఇక కాలేజీలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉండొచ్చు. ఓ సన్నివేశంలో భూమా తండ్రి వచ్చి ప్రొఫెసర్(రాహుల్ రవీంద్రన్)ని కాలేజీలో ఇలాగే ఉంటారా అని ప్రశ్నిస్తే వాళ్ళు అడల్ట్స్, వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం అని సమాధానం చెప్పడం ఆశ్చర్యం. మరో సీన్ లో మనం అడల్ట్స్ అయ్యాక పేరెంట్స్ ఏం చెప్పినా వినొద్దు, నీ ఇష్టం అని మోటివేషన్ ఇవ్వడం.. అసలు ఇలాంటి సీన్స్ చూసాక లెక్చరర్స్ ఇంత బాధ్యతారాహిత్యంగా ఎక్కడ ఉంటారా అనిపిస్తుంది.
తన చుట్టూ ఏం జరుగుతున్నా, విక్రమ్ ఇష్టం లేకపోయినా భూమా మాట్లాడదు. చివరి వరకు భూమా నోరు విప్పి గట్టిగా మాట్లాడుతుందేమో అని చూస్తాము. చూసినట్టే చివర్లో వచ్చి గట్టిగా ఓ నాలుగు మాటలు మాట్లాడుతుంది కానీ అసలు ఎందుకు అతను వద్దు అనేది అతనికి చెప్పదు. సినిమా చూస్తే ఆడియన్స్ కి మాత్రం అర్ధం అవుతుంది. ఇక విక్రమ్ తల్లి పాత్ర అయితే ఇటీవల కాలంలో ఒక తలి పాత్రని ఇంత వరస్ట్ గా ఎవరూ రాసి ఉండరేమో. అసలు గతంలో కూడా భర్తలు భార్యల్ని అనుమానించారు, కొట్టారు, తిట్టారు కానీ మరీ ఇంతలా ఉంటారా, డైరెక్టర్ తన నిజ జీవితంలో ఎవర్నైనా చూసి ఈ పాత్ర రాసుకున్నారేమో అనిపిస్తుంది.
ఇక చాలా సీన్స్ సాగి సాగి సాగదీశారు. ఒక వేళ ఆ సాగదీతతో సినిమా ఆడకపోతే ఇదే మలయాళం సినిమా అయితే హిట్ చేస్తారు అని మూవీ యూనిట్ అంటారు. కానీ అక్కడ రియాలిటీ ఉంటుంది, ఇక్కడ లేదు అని అర్ధం ఎపుడు అర్ధం చేసుకుంటారో. ఇందులో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నా ఎక్కడా కనెక్ట్ అవ్వవు. ఓ ఐదారేళ్ళ క్రితం బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండేవాళ్ళు, అమ్మాయిలు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు అనే కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు అక్కడక్కడా ఉండే ఉంటారు. వాళ్ళ కోసం ఈ సినిమా అనుకోవడమే.
రష్మిక నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ తో ఊదరగొడుతున్నారు. కానీ ఓ రెండు సీన్స్ తప్ప మిగతా అంతా రొటీన్ అనిపిస్తుంది. దీక్షిత్ శెట్టి మాత్రం నెగిటివ్ షేడ్స్ లో బాగా మెప్పించాడు. రాహుల్ రవీంద్రన్ ప్రొఫెసర్ పాత్ర చేసారు. ఈ పాత్ర సూపర్, స్పెషల్ అని ఓ రేంజ్ లో ప్రమోషన్స్ లో చెప్పారు. కానీ సినిమాలో అడదపాదడపా వచ్చి ఓ నాలుగు మోటివేషనల్ మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. రావు రమేష్, నారా రోహిత్, అను ఇమ్మాన్యుయేల్.. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగానే నటించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా కొన్ని సీన్స్ లో మాత్రం సస్పెన్స్ కి సాగదీసి హారర్ మ్యూజిక్ ఇవ్వడం గమనార్హం. పాటలు యావరేజ్. ఎడిటర్ మాత్రం తన కత్తెరకు చాలా పని చెప్పాలి. చాలా ల్యాగ్ సీన్స్ కట్ షార్ప్ కట్ చేయొచ్చు. సినిమా చాలా వరకు కాలేజీ లొకేషన్ లోనే అయిపోవడం గమనార్హం. టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అమ్మాయిని బాధపెడతాడు అనే ఒక పాత కథని తీసుకొని స్లో నేరేషన్ తో సరికొత్తగా చెప్పాలని మంచి ప్రయత్నమే చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ తో అమ్మాయి పడే కష్టాలను చూపించే రెగ్యులర్ సినిమా. ఈ సినిమాకు 2 .75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.