Bad Girl Review : ‘బ్యాడ్ గర్ల్’ మూవీ రివ్యూ.. ఓటీటీలోకి వచ్చేసిన వివాదాస్పద సినిమా.. ఈ జనరేషన్ అమ్మాయిల గురించా?
ఈ సినిమా టీజర్, ట్రైలర్ వచ్చినపుడే వివాదం నెలకొంది. దీనిపై కేసులు కూడా పెట్టారు. (Bad Girl Review)
Bad Girl Review
Bad Girl Review : అంజలి శివరామన్ మెయిన్ లీడ్ లో నటించిన సినిమా ‘బ్యాడ్ గర్ల్’. తమిళ దర్శకుడు వెట్రి మారన్, హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ నిర్మాణంలో వర్ష భరత్ దర్శకత్వంలో తమిళ్, హిందీలో ఈ సినిమా తెరకెక్కింది. బ్యాడ్ గర్ల్ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్ లో రిలీజవ్వగా తాజాగా జియో హాట్ స్టార్ ఓటీటీలోకి వచ్చింది. తమిళ్, హిందీతో పాటు తెలుగు, కన్నడలో కూడా అందుబాటులో ఉంది.(Bad Girl Review)
కథ విషయానికొస్తే..
రమ్య(అంజలి శివరామన్) ఓ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి. తనకు ఇంట్లో ఆచారాలు, పద్ధతులు నచ్చవు. ఇంట్లో అమ్మానాన్న మంచిగా చదువుకోమని చెప్పినా తనకు నచ్చదు. తనకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి, బయట తిరగలి అనే ఉంటుంది. రమ్య చదివే స్కూల్ లోనే తన తల్లి(శాంతిప్రియ) టీచర్ గా పనిచేస్తుంది. రమ్య స్కూల్ లో ఉన్నప్పుడు మొదట ఓ అబ్బాయిని ఇష్టపడుతుంది అతను సడెన్ గా వెళ్ళిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ నలన్(హ్రిదు హరూన్)తో ప్రేమలో పడుతుంది.
నలన్, రమ్య స్కూల్ ఎక్స్ కర్షన్ కి వెళ్ళినప్పుడు విడిగా బయటకెళ్ళి ఎంజాయ్ చేస్తారు. స్కూల్ లో ఓ జంట కిస్ చేసుకుంటునప్పుడు రమ్య తల్లి పట్టుకొని ప్రిన్సిపాల్ దగ్గరికి తీసుకెళ్లడంతో ఆ జంట రమ్య చేసే పనులు చెప్తుంది. దీంతో ప్రిన్సిపాల్ రమ్య – నలన్ ని పిలిచి వార్నింగ్ ఇస్తారు. రమ్యని ఇంట్లో అందరూ తిట్టడంతో లేచిపోదామని వెళ్తుంది కానీ వర్కౌట్ అవ్వదు. దీంతో రమ్యని స్కూల్ మారుస్తారు.
రమ్య మాత్రం నాకు నచినట్టే బతుకుతాను కాలేజీకి బయట హాస్టల్ కి వెళ్ళిపోతాను లేకపోతే చచ్చిపోతాను అని అమ్మని బెదిరిస్తోంది. ఇక ఇంట్లోంచి బయటకు వచ్చి కాలేజీలో చదువుకునేటప్పుడు అర్జున్ తో ప్రేమాయణం ఆ తర్వాత అతనితో విడిపోయి తర్వాత జాబ్ చేసేటప్పుడు ఇర్ఫాన్ తో ప్రేమాయణం ఆ తర్వాత అతనితో కూడా విడిపోయి స్వేచ్ఛ కావాలి అని బతికేస్తు ఉంటుంది. మరి రమ్య జీవితంలో ఎవరైనా ఉంటారా? రమ్య కుటుంబం విలువలు తెలుసుకుంటుంది ? పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇస్తుందా? చివరకు రమ్య లైఫ్ ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read : Mass Jathara Review : ‘మాస్ జాతర’ మూవీ రివ్యూ.. రైల్వే పోలీస్ గా రవితేజ ఏం చేసాడు?
సినిమా విశ్లేషణ..
ఈ సినిమా టీజర్, ట్రైలర్ వచ్చినపుడే వివాదం నెలకొంది. దీనిపై కేసులు కూడా పెట్టారు. థియేటర్స్ లో ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేదు. తమిళ్ లో కొంతమంది తీసే సినిమాలు చాలా వరకు సమాజం, దేవుళ్ళు, సంప్రదాయాలను వ్యతిరేకించే విధంగానే ఉంటాయి. ఈ బ్యాడ్ గర్ల్ కూడా అంతే. టైటిల్ కి తగ్గట్టు సినిమా ఉంటుంది. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా బతకాలనుకుంటుంది రమ్య. అయితే స్వేచ్ఛ అంటే పేరెంట్స్ ని విమర్శించడం, బాయ్ ఫ్రెండ్స్ తో తిరగడం, మందు, సిగరెట్స్ తాగడం మాత్రమే అనుకుంటుంది.
సినిమాలో కథ ఏమి ఉండదు. ఒక అమ్మాయి జీవితం సాగుతూ ఉంటుంది. స్కూల్ లెవల్, కాలేజీ లెవల్, ఆఫీస్ లెవల్ లో ప్రేమ కథలతో సాగుతుంది. ప్రతి సీన్ చాలా ల్యాగ్ ఫీల్ వస్తుంది. అమ్మాయిని తక్కువ చేసి చూస్తున్నారు, కట్టుబాట్లతో కట్టేస్తున్నారు అనే పాత పాయింట్ ని చెప్పాలని ప్రయత్నించినా అది వర్కౌట్ అవ్వలేదు. గతంలో ఇలాంటి పాయింట్ తో చాలా మంచి సినిమాలు వచ్చాయి. అందులో అమ్మాయి పడుతున్న కష్టాలు చూపించి అమ్మాయి స్వతంత్రంగా ఎదగాలి అని చూపించేవాళ్ళు. కానీ ఇందులో కనీసం పేరెంట్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం, కుటుంబానికి విలువ ఇవ్వడం ఉండవు పోగా అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటమే స్వేచ్ఛ, స్వతంత్రం అనే భావనలో చూపించారు. ఎవరి నమ్మకాలు వాళ్లకు ఉంటాయి. అవి నమ్మాలా వద్దా అనేది మన ఇష్టం కానీ అవతలి వాళ్ళ నమ్మకాలను కించపరచకూడదు అనే బేసిక్ సెన్స్ కూడా లేకుండా కొన్ని సీన్స్ రాయడం గమనార్హం.
ఈ సినిమాతో డైరెక్టర్ ఏం చెపుదాం అనుకుందో అర్ధం కాదు. క్లైమాక్స్ ఏం ఇవ్వాలో తెలియక మధ్యలోనే ఆపేసినట్టు ఉంటుంది. తన జీవితంలోకి వచ్చి వెళ్లిన అబ్బాయిలు హ్యాపీగా ఉంటారు, తన ఫ్రెండ్స్ హ్యాపీగా ఉంటారు. కానీ తనకు ఏ తోడు లేక బాధ పడుతూనే బయటకు మాత్రం స్వేచ్ఛ, నా ఇష్టం, నేనే గ్రేట్ నచ్చినట్టు బతుకుతున్నా అన్నట్టు చూపించారు. సినిమాపై మరీ ఎక్కువ విమర్శలు వస్తాయేమో అని మధ్యలో తల్లి ఎమోషన్ ని, తల్లి కూడా బాధలు పడుతుంది అని చూపించడానికి ట్రై చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు. అదే సమయంలో తండ్రి కుటుంబం కోసం కష్టపడుతున్నాడు అనే పాయింట్ ని మర్చిపోయారు.
ఈ సినిమాని లేడీ డైరెక్టర్ తీయడం గమనార్హం. తన ఆలోచనలు, తన జీవితం లోని సన్నివేశాలు సినిమాలో చూపించిందేమో అనిపిస్తుంది. ఈ జనరేషన్ అమ్మాయిలు ఇలాగే ఉండాలనుకుంటున్నారు అనే పాయింట్ చూపించినట్టు అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళను సమాజం బ్యాడ్ గర్ల్ అని అంటారని భావించి టైటిల్ కావాలనే అది పెట్టినట్టు ఉన్నారు.

నటీనటుల పర్ఫార్మెన్స్..
అంజలి శివరామన్ మెయిన్ లీడ్ లో నటించిన అమ్మాయి మాత్రం తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించింది. హీరోయిన్ తల్లి పాత్రలో సీనియర్ నటి శాంతి ప్రియ చాలా బాగా పెర్ఫార్మ్ చేసారు. మలయాళ నటుడు హ్రిదు హరూన్ స్కూల్ లవర్ పాత్రలో బాగానే మెప్పించాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించిన శరణ్య రవిచంద్రన్ కి మంచి పాత్ర పడింది.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్ బాగున్నాయి. లొకేషన్స్ రియలిస్టిక్ గా చూపిద్దామని ప్రయత్నిచారు కానీ కొన్ని చోట్ల సినిమాటిక్ గానే అనిపిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యావరేజ్. ఉన్న రెండు పాటలు అంతగా ఆకట్టుకోవు. తెలుగు డబ్బింగ్ బాగానే కుదిరింది. ఓ పాత కథని తీసుకొని అమ్మాయిలకు స్వేచ్ఛ కావాలి, కుటుంబం వద్దు అనే పాయింట్ తో వర్ష భరత్ ఈ సినిమాని తెరకెక్కించింది. నిర్మాణ పరంగా తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమాని తీశారు.
మొత్తంగా ‘బ్యాడ్ గర్ల్’ సినిమా పేరెంట్స్, కుటుంబం వద్దు స్వేచ్ఛగా సమాజంలో ఇష్టమొచ్చినట్టు బతకాలి అనుకునే ఓ అమ్మాయి కథ. మీ మనోభావాలు దెబ్బతినవు అనుకుంటే ఫార్వార్డ్ చేసుకుంటూ ఓ సారి చూసేయొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
