Line Man Review : ‘లైన్ మ్యాన్’ మూవీ రివ్యూ.. కొన్ని రోజుల పాటు కరెంట్ లేకుండా జీవిస్తారా?

లైన్ మ్యాన్ సినిమా ఓ పల్లెటూళ్ళో కరెంట్ లైన్ మ్యాన్, వందేళ్ల ఓ బామ్మ చుట్టూ తిరుగుతూ ఊళ్ళో కొన్ని రోజులు కరెంట్ లేకుండా ఎందుకు బతికారు అనే ఓ ఎమోషనల్ పాయింట్ తో తెరకెక్కించారు.

Line Man Review : ‘లైన్ మ్యాన్’ మూవీ రివ్యూ.. కొన్ని రోజుల పాటు కరెంట్ లేకుండా జీవిస్తారా?

Thrigun Line Man Movie Review and Rating

Line Man Review : త్రిగుణ్(Thrigun), కాజల్ కుందెర్ జంటగా వి.రఘుశాస్త్రి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లైన్ మ్యాన్’. పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్ పై ఈ సినిమాని తెరకెక్కించారు. కేరళలో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమాని తీశారు. లైన్ మ్యాన్ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి నేడు మార్చ్ 22న విడుదల అయింది.

కథ విషయానికొస్తే.. ఖమ్మం జిల్లా సత్తెపల్లి గ్రామంలో విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్ గా పనిచేస్తున్న తండ్రి సడెన్ గా మరణించడంతో ఆ జాబ్ నటరాజు అలియాస్ నట్టు(త్రిగుణ్)కి వస్తుంది. ఇక ఆ ఊర్లో కరెంట్ రావాలన్నా, పోవాలన్నా అంతా నట్టు చేతిలోనే ఉంటుంది. ఆ గ్రామంలో అందరికి పురుళ్ళు పోస్తూ, సహాయం చేస్తూ ఆ ఊరి దేవతగా దేవుడమ్మ(బి.జయశ్రీ) ఉంటుంది. ఆమెకు 99 సంవత్సరాలు నిండి వందేళ్లు వస్తుండటంతో ఊరంతా ఆమె 100వ పుట్టినరోజును గ్రాండ్ గా చేయాలని ఫిక్స్ అవుతారు. ఊరు ఊరంతా సెలబ్రేట్ చేసుకోడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు.

కానీ అదే సమయానికి నట్టు కరెంట్ ఇవ్వను అని చెప్తాడు. ఎవర్ని కరెంట్ ఇవ్వనివ్వను అని గ్రామస్థుల అందరిముందు మాట్లాడతాడు. అసలు ఈ పుట్టిన రోజు ఐడియా ఇచ్చిన నట్టునే అలా మాట్లాడటంతో గ్రామస్థులు ఆశ్చర్యపోతారు. నట్టు ఎందుకు కరెంట్ ఇవ్వను అంటాడు? దానికి దేవుడమ్మ ఏమంటుంది? అసలు కొన్ని రోజుల పాటు కరెంట్ ఆపేయడానికి కారణం ఏంటి? ఊళ్ళో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు? మళ్ళీ ఆ ఊరికి నట్టు కరెంట్ ఇచ్చాడా అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

సినిమా విశ్లేషణ.. ఈ రోజుల్లో గంట సేపు కరెంట్ పోతేనే తట్టుకోలేము. అలాంటిది ఊరంతా కలిసి కొన్ని రోజులు కరెంట్ లేకుండా ఎలా ఉన్నారు? ఎందుకు ఉన్నారు? ఏ మంచి పని కోసం అందరూ కరెంట్ లేకపోయినా పర్లేదు అని ఒప్పుకున్నారు అనే కథాంశంతో సినిమాని తెరకెక్కించారు. ఒక పల్లెటూరు, పల్లెటూళ్ళో ఉండే రకరకాల మనుషులు, వాళ్ళ పనులు ఫస్ట్ హాఫ్ అంతా ఇలాగే కొంచెం సాగుతుంది. ఇంటర్వెల్ సమయానికి కరెంట్ గురించి చర్చ మొదలవుతుంది. ఆ తర్వాత ఎందుకు కరెంట్ లేకుండా ఉన్నారు అని ఆసక్తిగా సాగుతుంది. కరెంట్ లేకుండా రాత్రి పూట పల్లెల్లో గతంలో ఎలా ఉండేవారో అలాంటి సీన్స్ అన్ని చక్కగా చూపించారు.

కొన్ని రోజుల పాటు ఓ గ్రామ ప్రజలు కరెంటు లేకుండా బతకాలి అని డిసైడ్ అయ్యారంటే ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణాన్ని దర్శకుడు ఎమోషనల్ గా బాగానే చెప్పినా స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం కొంచెం సాగతీత కనిపిస్తుంది. ఇక సినిమాలో లవ్ స్టోరీ ఉన్నా దర్శకుడు దానిమీద పెద్దగా దృష్టి పెట్టలేదు. గ్రామీణ వాతావరణం, అక్కడి ప్రజల పాత్రలని బాగా చూపించారు. చివర్లో ఓ ఎమోషనల్ క్లైమాక్స్ ఇచ్చి ప్రేక్షకులను మరింత కనెక్ట్ అయ్యేలా చేసారు.

Also Read : Om Bheem Bush : ‘ఓం భీమ్ బుష్’ రివ్యూ.. సెకండ్ హాఫ్ ఎవరూ ఊహించలేరు.. నవ్వించి.. భయపెట్టి..

నటీనటుల విషయానికొస్తే.. ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా నటించిన త్రిగున్ ఈ సినిమాలో ఓ సాధారణ లైన్ మ్యాన్ గా, పల్లెటూళ్ళో ఉండే వ్యక్తిగా హీరో లుక్ కి దూరంగా న్యాచురల్ గా కనిపించి నటించాడు. హీరోయిన్ కాజల్ కుందెర్ మాత్రం దేవుడమ్మ మనవరాలి పాత్రలో ఏదో హీరోయిన్ ఉండాలి అని పెట్టినట్టు ఉంటుంది. 99 ఏళ్ల వృద్ధురాలిగా దేవుడమ్మ పాత్రలో బి.జయశ్రీ అద్భుతంగా నటించారు. ఆమె చుట్టూనే సినిమా మెయిన్ పాయింట్ నడుస్తుంది. నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్‌.. పలువురు నటీనటులు ఓకే అనిపిస్తారు.

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీలో విలేజ్ లుక్స్ ని చాలా బాగా చూపించారు. కథ మంచి పాయింట్ అయినా కథనంలో మాత్రం కొంచెం సాగదీయడంతో అక్కడక్కడా బోర్ కొడుతుంది. సినిమా నిడివి రెండు గంటలే కావడం ఒక ప్లస్ పాయింట్. మంగ్లీ పాడిన ఓ పాట బాగుంటుంది. ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా ఇచ్చారు. చిన్న హీరో అయినా మంచి బడ్జెట్ లోనే నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాని తీశారు నిర్మాతలు. దర్శకుడిగా రఘుశాస్త్రి మొదటి ప్రయత్నంలో పర్వాలేదనిపించాడు.

మొత్తంగా లైన్ మ్యాన్ సినిమా ఓ పల్లెటూళ్ళో కరెంట్ లైన్ మ్యాన్, వందేళ్ల ఓ బామ్మ చుట్టూ తిరుగుతూ ఊళ్ళో కొన్ని రోజులు కరెంట్ లేకుండా ఎందుకు బతికారు అనే ఓ ఎమోషనల్ పాయింట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.