త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ కథానాయకులు.. నితిన్‌తో ప్రారంభం..
పెళ్లంటే పందిళ్లు సందళ్లు మూడే ముళ్లు ఏడే అడుగులూ మొత్తం కలిపి నూరేళ్లు అన్నారు ఓ సినీకవి. ఇప్పుడు అదే పాట పాడుతున్నారు చాలా మంది యువతారలు. తమకు తాముగా పెళ్లి ఊసులు చెప్తున్నారు. ఇక ఆగేది లేదని పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు.. మరి పెళ్లి బాట పట్టిన స్టార్ హీరోల హీరోయిన్ల కబుర్లేమిటో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ శర్వానంద్ నోట పెళ్లి మాట వినిపించిందీ మధ్య. ప్రస్తుతం బ్యాక్ అండ్ బ్యాక్ మూవీస్‌తో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో తనకు భార్య కావాలంటే ఉండాల్సిన గుణగణాల్ని ఏకరువు పెట్టేశాడీ మధ్య. నాగచైతన్య నటించిన ‘మజిలీ’ సినిమాలో సమంత లాంటి సుగుణాలున్న అమ్మాయి దొరికితే వెంటనే పెళ్లి పీటలు ఎక్కేయడమే అని చెప్పేశాడు.
శేఖర్ కమ్ముల ‘హ్యాపీడేస్’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోల్లో ఇప్పటికీ అప్పుడప్పుడూ కనిపిస్తుంది నిఖిల్ ఒక్కడే. మిగిలిన వారందరూ ఓ పది పన్నెండు సినిమాలు చేసి ఫేడవుట్ అయిపోయారు. ఈ మధ్యే ‘అర్జున్ సురవరం’ తో హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. డాక్టర్ పల్లవి వర్మతో కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్ ఇప్పుడు తనతోనే పెళ్లి మండపంలో కాలు పెడుతున్నాడు.
దాదాపు పద్దెనిమిదేళ్ల క్రితం విడుదలైన ‘జయం’ చిత్రం ద్వారా ఇండస్ట్రీలో ప్రవేశించి వరసగా హిట్స్ కొట్టి ఆ తర్వాత ఫ్లాపుల బారిన పడి మళ్లీ హిట్ ట్రాకెక్కి ఇలా అనేక ఢక్కామొక్కీలు తిన్న నితిన్ కాస్త ఆలస్యంగానే పెళ్లి కబురు చెప్పాడు. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ మూవీ చేస్తున్న నితిన్ చేతిలో అది కాక మరో రెండు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. ఈ బిజీ సమయంలోనే పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు…
వరుసగా సొంత సినిమాలు చేస్తూ హీరోగా తనని తాను ఎలివేట్ చేసుకుంటూ వెళ్తున్న యంగ్ హీరో నాగశౌర్య కూడా తన మనసులో ఉన్న పెళ్లి ముచ్చట బయటేసేశాడు. తన సీనియర్ ప్రభాస్ పెళ్లి చేసుకుంటే తక్షణం తను కూడా పెళ్లి చేసేసుకుంటానని రీసెంట్‌గా జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించేశాడు. తను కథ అందించిన ‘అశ్వధ్థామ’ చిత్రం హిట్ టాక్‌తో నడుస్తున్న సందర్భంలోనే ఈ మాట చెప్పేశాడు నాగశౌర్య. తన కోరిక నెరవేరడానికైనా ప్రభాస్‌కు పెళ్లి కావాలని కోరుకుందాం.
రాజ్ తరుణ్ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కేస్తున్నాడట. విజయవాడకు చెందిన అమ్మాయితో ఆరేళ్లుగా తను ప్రేమలో ఉన్నట్టు రాజ్ తరుణ్ చెప్తున్నాడు. ఇప్పుడు పెద్దల అంగీకారంతో ఒక్కటి అవుతున్నారు. ఆరేళ్ల క్రితం విశాఖలో జరిగిన తన పుట్టినరోజు వేడుకలో తొలి సారి ఆమెను చూసి మనసు ఇచ్చేశాడట.
సీనియర్ హీరోయిన్ కాజల్ కూడా పెళ్లి బాట పట్టేసింది. రీసెంట్‌గా లక్ష్మీ మంచు షోకి హాజరైన సందర్భంగా కాజల్ తన మనసులో మాటను బయటపెట్టింది. ప్రభాస్ లాంటి అబ్బాయి కనుక తనకు కనిపిస్తే ఠక్కున పెళ్లాడేస్తానని ఇంక ఏ మాత్రం ఆలోచించే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చేసింది.