Yakkali Ravindra Babu Passed away
టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం సీనియర్ నటుడు చంద్రమోహన్ మరణించడంతో విషాదంలో ఉన్న చిత్ర పరిశ్రమకు మరో షాక్ తగిలింది. ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్ర బాబు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నాం తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 55 సంవత్సరాలు.
శ్రావ్య ఫిలిమ్స్ వ్యవస్థాపక నిర్మాతలలో ఒకరైన రవీంద్ర బాబు సొంతఊరు, గంగపుత్రులు లాంటి అవార్డు విన్నింగ్ చిత్రాలను నిర్మించారు. అంతే కాదు.. ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్, గల్ఫ్, వలస లాంటి విజయవంతమైన సినిమాలను నిర్మాతగా వ్యవహరించి తన అభిరుచిని చాటుకున్నారు.
రవీంద్ర బాబు మార్కాపురంలో పుట్టారు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఛార్టర్డ్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. సినిమాలపై ఇష్టంతో నిర్మాతగా మారారు. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం బాషల్లో దాదాపు 17 సినిమాలు నిర్మించారు. గీత రచయితగానూ పని చేశారు. హనీ ట్రాప్, సంస్కార కాలనీ , మా నాన్న నక్సలైట్ వంటి పలు చిత్రాలకు సాహిత్యం అందించారు. రవీంద్రబాబుకు భార్య రమాదేశి, కుతూరు ఆశ్రీత, కుమారుడు సాయి ప్రభాస్ లు ఉన్నారు.