కొట్టు పెట్టించాను.. ప్రతి పండక్కి ఫొటో పంపేది.. రజితమ్మ మృతి-విచారం వ్యక్తం చేసిన ఉదయభాను

రజితమ్మ మరణంతో విషాదంలో మునిగిపోయిన ప్రముఖ యాంకర్ ఉదయ భాను..

రజితమ్మ మరణంతో విషాదంలో మునిగిపోయిన ప్రముఖ యాంకర్ ఉదయ భాను..

తనకున్న లోపం దేవుడిచ్చిన శాపం కాదు.. తనలాంటి సమస్య మరెవరికీ రాకూడదు అనుకుని ఫ్లోరైడ్ రక్కసి కోరల్లో చిక్కుకున్న నిస్సహాయులైన వారికి సాయం చేయడానికి తన లోపాన్ని సైతం లెక్కచెయ్యకుండా తుది శ్వాస వరకు పోరాడింది రజిత.. ఇటీవల ఆమె కన్నుమూసింది. ఈ సందర్భంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను.. రజితతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ సందేశాన్ని షేర్ చేశారు.

‘‘అశ్రు నివాళి : రజితమ్మ నాకు దేవుడిచ్చిన బంగారు చెల్లెల్లలో ఒకరు.. తను ఇక లేదు. 24 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి.. తిరిగి రాని లోకాలకి వెళ్లిపోయింది.. ఈ ఉదయం 10 గంటలకు అస్తమించింది నా చిట్టి చెల్లి రజితమ్మ.. నిశ్శబ్దంగా సడి చప్పుడు లేకుండా తన ప్రశ్నలకి జవాబు దొరక్కముందే వెళ్లిపోయింది.
పొరపాటు పడకండి ఇది కరోనా మరణం కాదు.. గాలి, నీరు, నింగిని కల్మషం చేసిన కరుణ లేని కర్కశుల వల్ల కలిగిన మరణం.. మానవ తప్పిదాలకు స్వార్ధానికి ప్రత్యక్ష సాక్షి ఈ రజితమ్మ.

Read Also : వారే నిజమైన హీరోలు.. ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ వీడియో..
2014 నిగ్గదీసి అడుగు కార్యక్రమం చేస్తున్నప్పుడు నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం ఖుదాబక్షుపల్లి లో నాకు ఈ చిట్టి తల్లితో విడదీయలేని బంధం ఏదో ముడిపడిపోయింది.
ఆ ఊరి పేరు ఖుదాబక్ష్ అంటే అర్ధం – దేవుడు రక్షించుగాక అని.. కానీ మానవుడి స్వార్ధం ముందు దేవుడు కూడా ఆ పల్లెను రక్షించలేకపోయాడు. అలా ఎన్ని ఊర్లో అక్కడ.. ఫ్లోరైడ్ రక్కసి కోరల్లో చిక్కుకున్న నిస్సహాయులైన బిడ్డలెందరో.. కలుషిత నీటి రూపంలో ఫ్లోరైడ్ విషం తాగుతున్న బిడ్డలెందరో.. తాము చేయని తప్పుకు జీవితాంతం శిక్షను అనుభవిస్తున్న అసహాయులు ఎందరో.. అలాంటి బిడ్డే ఈ రజితమ్మ. తనని చూసి నా గుండె తరుక్కుపోయింది.. తనకు నా చేతనైంది చేయాలనీ సంకల్పించి తన కాళ్ళ మీద తాను నడవలేకపోయిన, తన జీవితంలో తలెత్తుకుని బ్రతకాలని ఓ చిన్ని ప్రయత్నం చేసాను. ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టించాను..

అప్పటినుంచి తన తుది శ్వాశ వరకు ఓటమి ఎరుగక ఎంత ముద్దుగా చక్కగా షాప్‌ని నడుపుకుందో.. తను తన కుటుంబానికి భారం కాదు ఆసరా అయింది.. తన ఆత్మా విశ్వాసం ఎందరికో భరోసా నిచ్చింది. ప్రతి పండక్కి తనకి కలిగిన ప్రతి సంతోషానికి నాకొక ఫోటో పంపేది.. షాప్ ముందు రంగురంగుల పెద్ద ముగ్గు వేసి, ముగ్గు మధ్యలో చిన్న బొడ్డెమ్మాలా కూర్చుని.. అక్కా హ్యాపీ సంక్రాంతి.. అక్కా హ్యాపీ దసరా.. అక్కా హ్యాపీ దీపావళి.. అక్కా హ్యాపీ BIRTHDAY.. అక్కా పాపలకి ముద్దులు అంటూ అందరికంటే ముందు తను WISHES పంపేది..

ఇప్పుడిక ఆ WISHES రావు.. ఇక నా చిట్టి చెల్లి లేదు.. గుండెలవిసి పోయేలా ఏడ్చినా ఇక రాదు.. ఏ జన్మ బంధమో తన గుండె నిండా నా పైన ఎంత ప్రేమో.. మాటల్లో చెప్పలేని దుఃఖం కట్టలు తెంచుకుని వస్తుంది. ఖుదాభక్షపల్లి లో భూగర్భంలోకి నీరింకినట్టు నా కళ్ళలో నీళ్లింకిపోతున్నాయి.. అక్కా నేనెందుకు ఇలా అయ్యాను.. నా తప్పేంటి.. నాలా ఇంకెంతమంది.. ఇంకెంతకాలం ఇలా పుడతారు.. ఇలా తను సంధించిన ప్రశ్నలకి సమాధానం చెప్పేది ఎవ్వరు ?
నా చిట్టి చెల్లి రజితమ్మ ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ రజిత వాళ్ళ అక్క ఉదయ భాను’’.. అంటూ రజితతో తనకున్న అనుబంధాన్ని భావోద్వేగభరితంగా పోస్ట్ చేస్తూ.. కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ Hashtags జతచేశారు ఉదయభాను..