SPB – Ilaiyaraaja : సంగీత దర్శకుడు, మ్యాస్ట్రో ఇళయరాజాతో లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అరే.. ఒరే.. అని పిలుచుకునేంత స్నేహం ఉంది. అయితే వీరి మధ్య నెలకొన్న చిన్న వివాదం కారణంగా ఇరువురి మధ్య కొద్దిగా గ్యాప్ వచ్చింది.
అమెరికాలో ప్రదర్శనలు ఇస్తున్న సమయంలో ఆ వివాదం చోటు చేసుకుంది. అమెరికాలో బాలు 12 కార్యక్రమాలు చేయడాని అంగీకరించారు. అప్పటికే రెండు పూర్తయిపోయాయి. అనూహ్యంగా ఇళయారాజా నుంచి లీగల్ నోటీసులు రావడంతో బాలు షాక్ అయ్యారు. తనపాటలు బాలు పాడకూడదని రాజా ఆ నోటీసులు జారీ చేశారు.
ఆ నోటీసులు అందుకున్న తర్వాత బాలు మనస్తాపానికి గురయ్యారట. ఇక ఆ తర్వాత ఏ కార్యక్రమంలోనూ బాలు, ఇళయరాజా పాటలు పాడలేదు. ఇద్దరు మంచి మిత్రులు కదా.. ఎందుకు నువ్వు ఇళయరాజాకు ఫోన్ చేస్తే వివాదం ఇక్కడితో సద్దుమణుగుతుంది కదా అని చాలామంది చెప్పినా బాలు వినలేదట.
బాలు తన పాటలు పాడకూడదని రాజా చెప్పడం వెనుక కారణం ఏంటంటే.. పలు కార్యక్రమాల్లో బాలు, రాజా కంపోజ్ చేసిన పాటలు ఆలపించారు. అయితే తనకు చెప్పకుండా తన పాటలు పాడడం పట్ల రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏదైనా చారిటీ కోసం ఫ్రీగా పాడితే పర్వాలేదు కానీ డబ్బు తీసుకుని తన పాటలు పాడుతున్నప్పుడు తనకు రావాల్సినదేదో ఇస్తే తనే ఏదైనా చారిటీకి విరాళంగా ఇస్తాను కదా అనేది రాజా అభిప్రాయం. ఈ వ్యవహారం వల్ల ఇద్దరిమధ్య చిన్న గ్యాప్ వచ్చింది. తర్వాత కలిసిపోయారనుకోండి.
ఇటీవల బాలు హాస్పిటల్లో అడ్మిట్ అయినపుడు ఇళయరాజా త్వరగా రా బాలు.. మనం మళ్లీ కలిసి పనిచేయాలంటూ ఓ ఎమోషనల్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు భారతీరాజా ద్వారా ఇళయరాజా బాలుకు పరిచయమయ్యారు. వీరి కలయికలో తమిళ్, తెలుగులో ఎన్నో అత్యద్భుతమైన పాటలు వచ్చాయి.