కాంగ్రెస్‌లో బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళా

  • Publish Date - March 27, 2019 / 02:04 AM IST

వెటరన్ బాలీవుడ్ బ్యూటీ ఊర్మిళా మాటోండ్కర్ కాంగ్రెస్‌లో చేరబోతోందా..ఔననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు..అంత స్పష్టంగా చెప్పడం లేదు కానీ కుదిరితే ఏకంగా లోక్‌సభ బరిలో కూడా పోటీకి ఆమె దిగుతున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో బాలీవుడ్‌తో పాటు ముంబై పొలిటికల్ సర్కిల్‌లోనూ ఆసక్తికరమైన చర్చకి తెరలేచింది. ఊర్మిళ ముంబై నార్త్ నుంచి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోతోందట. ఈ సీటు బిజెపికి స్ట్రాంగ్ బేస్‌లాంటిది. ఇలాంటి చోట కాంగ్రెస్ కాండిడేట్‌గా ఊర్మిళని దింపితే పోటీ గ్లామర్‌తో పాటు మంచి రసవత్తరంగా మారుతుందని అంచనా. మరోవైపు బాంబే కాంగ్రెస్ ప్రెసిడెంట్ సంజయ్ నిరుపమ్ కూడా ఈ వార్తలపై ఎలాంటి నిర్ధారణ చేయలేదు.
Read Also : ‘మహర్షి’ మ్యూజికల్ జర్నీ

‘రంగీలా’తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న 45 ఏళ్ల ఊర్మిళ ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేదు. ఇరవైఏళ్ల క్రితమైతే యూత్‌ డ్రీమ్‌గాళ్‌ ఊర్మిళనే..బోల్డ్ స్టేట్‌మెంట్స్‌తో పాటు బికినీ సీన్లకి పెట్టింది పేరు ఊర్మిళ. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది. 2014 ఎన్నికలలో ఇక్కడ్నుంచి బిజెపి తరపున గోపాల్ శెట్టి..కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపమ్‌పై నాలుగు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలవడం గమనార్హం. 2004లో మాత్రం ఇక్కడ్నుంచే నటుడు గోవిందా కాంగ్రెస్ తరపున ఎంపిగా ఎన్నికయ్యారు. తిరిగి మళ్లీ ఇక్కడ పాగా వేయాలంటే బాలీవుడ్ గ్లామరే శరణ్యం అనుకుందేమో కానీ కాంగ్రెస్ ఊర్మిళ పేరుని పరిశీలిస్తున్నట్లు టాక్. బాలీవుడ్ నటుల ఓట్లన్నీ ఇక్కడే కావడంతో ఊర్మిళ కనుక రంగంలోకి దిగితే గెలుపు ఖాయమనే అంచనా. 
Read Also : నాకు బతకడమే ఓ కల : 28న ఐరా