Vennela Kishore Ananya Nagalla Srikakulam Sherlockholmes Movie Review and Rating
Srikakulam Sherlockholmes Movie Review : వెన్నెల కిషోర్ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన సినిమా ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’. రైటర్ మోహన్ దర్శకత్వంలో వెన్నపూస రమణారెడ్డి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కించారు. రవి మహాదాస్యం, అనన్య నాగళ్ళ, అనీష్ కురువిళ్ళ, కాలకేయ ప్రభాకర్, మురళీధర్ గౌడ్, అదితి గౌతమ్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ సినిమా నేడు డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కథ విషయానికొస్తే.. 1991 మే 20న రాజీవ్ గాంధీ వైజాగ్ వచ్చి అటునుంచి పెరంబదూర్ వెళ్లి అక్కడ మే 21న చనిపోతారు. అదే రోజు మే 21 రాత్రి వైజాగ్ బీచ్ లో పులిదండు మేరీ అనే అమ్మాయి హత్య జరుగుతుంది. పోలీసులు – జర్నలిస్టుల వాగ్వాదంలో CI భాస్కర్(అనీష్ కురువిళ్ళ) ఓ జర్నలిస్ట్ తో వారం రోజుల్లో హంతకుడిని పట్టుకుంటాను లేకపోతే రిజైన్ చేస్తాను అని ఛాలెంజ్ చేస్తాడు. కానీ అదే సమయంలో రాజీవ్ గాంధీ హత్యకేసు విచారణకు పై ఆఫీసర్ వైజాగ్ రావడంతో ఈ కేసుని వారం రోజుల్లో డీల్ చేయాలని ఓ ప్రైవేట్ డిటెక్టివ్ అయిన షెర్లాక్ హోమ్స్(వెన్నెల కిషోర్)కి అప్పచెప్తారు.
షెర్లాక్ హోమ్స్ కి సపోర్ట్ గా కానిస్టేబుల్ లక్ష్మి(అదితి గౌతమ్)ని ఇస్తారు. ఈ హత్యకేసులో ఏడుగురు సస్పెక్ట్స్ ఉన్నారని టెలిఫోన్ బూత్ నడిపే బాలు(రవి మహాదాస్యం), వికలాంగ పిల్లల ఆశ్రమంలో పనిచేసే భ్రమ(అనన్య నాగళ్ళ), సస్పెండెడ్ పోలీస్(కాలకేయ ప్రభాకర్), ఝాన్సీ అనే అమ్మాయి, ముగ్గురు జాలర్ల గురించి షెర్లాక్ హోమ్స్ చెప్పడంతో పోలీసులు వాళ్ళని విచారణకి తీసుకొస్తారు. షెర్లాక్ హోమ్స్ ఒక్కొక్కరిని విచారించి హత్య చేసిన వాళ్ళను ఎలా పట్టుకున్నాడు ? షెర్లాక్ హోమ్స్ డిటెక్టివ్ ఎందుకయ్యాడు? అసలు మేరీని ఎందుకు హత్య చేసారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
Also Read : Oh Bhama Ayyo Rama Glimpse : సుహాస్ ఓ భామ అయ్యో రామా మూవీ గ్లింప్స్ వచ్చేసింది..
సినిమా విశ్లేషణ.. ఒక మర్డర్ మిస్టరీని సాల్వ్ చేసే కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా అదే కోవలోకి చెందింది. ఒక హత్య జరిగినప్పుడు ఆ హత్యలో కొంతమంది అనుమానితులను పట్టుకొని వారి వారి దృక్పథాలలోంచి ఏం జరిగింది అని చెప్తూ ఒక కామెడీ డిటెక్టివ్ కేసు ఎలా డీల్ చేసాడు అని సస్పెన్స్ కథాంశంతో శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ ని నడిపించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఓ హత్య జరగడం, ఆ హత్యలో అనుమానితులుగా భావించే వాళ్ళను తీసుకొచ్చి వాళ్ళని విచారించడం జరుగుతుంది. సెకండ్ హాఫ్ లో ఆ విచారణ కొనసాగిస్తూ షెర్లాక్‌హోమ్స్ ఫ్లాష్ బ్యాక్, ఆ హంతకులను ఎలా పట్టుకున్నాడు, హంతకులు ఎవరు అని చూపిస్తారు.
ఫస్ట్ హాఫ్ కాస్త స్లో నేరేషన్ తో హత్య జరగడం, దాంట్లో అనుమానితులను విచారించడం, వాళ్ళు చెప్పే కథలతో బాగానే సాగుతుంది. కానీ సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ పాత్రకు ఓ ఫ్లాష్ బ్యాక్ పెట్టినా ఆ ఎమోషన్ పండలేదు. అసలు అంత ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రాజీవ్ గాంధీ మరణానికి దీనికి లింక్ పెట్టి కథ చెప్పినా అసలు కథకి సంబంధమే ఉండదు. ప్రమోషన్స్ లో మూవీ యూనిట్ ఓ పెద్ద సంఘటన జరిగితే చుట్టూ జరిగే చిన్నవాటిని ఎవరూ పట్టించుకోరు అందుకే రాజీవ్ గాంధీ పాయింట్ తీసుకున్నాం అని చెప్పారు కానీ అసలు ఆ పాయింట్ లేకపోయినా ఈ కథని నడిపించొచ్చు.
ఈ పాయింట్ కథని ఎక్కడైనా, ఏ కాలంలో అయినా తీయచ్చు కానీ శ్రీకాకుళం యాసలో తీసినా ఆ యాసలో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడలేదు. ఇక క్లైమాక్స్ అయితే రొటీన్. చాలా సినిమాల్లో ఒక మర్డర్ వెనక ఏం జరిగింది అని చివర్లో ఏం చూపిస్తారో ఇందులో కూడా అదే చూపించారు. మర్డర్ కి కారణం అయితే కొత్తగా ఉండదు. హంతకులు ఎవరో అనేది ముందు నుంచే ఈజీగానే గెస్ చేసేయొచ్చు. చివరి వరకు ఆ సస్పెన్స్ ని నిలబెట్టలేకపోయారు. రైటర్ డైరెక్టర్ గా మారడంతో తన రైటింగ్ ప్రాసలు బాగానే ఉపయోగించారు.
సస్పెన్స్ తో పాటు కామెడీ అని చెప్పినా ఎక్కడా నవ్వు రాదు. సీరియస్ గా ఉండాల్సిన జర్నలిస్ట్ – పోలీస్ సీన్స్ కూడా కామెడీ చేసేసారు. దానికి కారణం క్లైమాక్స్ లో చెప్పి మరీ ఇంత సిల్లీనా అనేలా చేసారు. అసలు నేనింతే హీరోయిన్ అదితి గౌతమ్ ఎక్కువ ప్రభావం లేని ఇలాంటి కానిస్టేబుల్ పాత్ర ఎలా ఒప్పుకుందో. షెర్లాక్ హోమ్స్ కి అసిస్టెంట్స్ అని వాళ్ళ తల్లితండ్రుల పాత్రలు కూడా ఓవర్ డ్రమాటిక్ గా ఉంటాయి. ఇటీవల వరుసగా మంచి సినిమాలు రిలీజ్ చేసి హిట్స్ కొడుతున్న వంశీ నందిపాటి అసలు ఇలాంటి సినిమాని ఎలా తీసుకున్నాడా అనే సందేహం కచ్చితంగా వస్తుంది.
Also Read : Vijay Devarakonda : విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా షూటింగ్ అప్పటినుండే.. హీరోయిన్ ఆమేనా..?
నటీనటుల పర్ఫార్మెన్స్.. కామెడీలో తన బెస్ట్ ఇచ్చే వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కూడా డైరెక్టర్ అడిగినట్టు తన బెస్ట్ ఇచ్చినా చాలా చోట్ల ఓవర్ యాక్షన్ చేసినట్టే అనిపిస్తుంది. అనన్య నాగళ్ళ మాత్రం క్యూట్ గా కనిపిస్తూనే తన నటనతో మెప్పిస్తుంది. రవి మహాదాస్యం కూడా పర్వాలేదనిపించారు. ఝాన్సీ పాత్రలో నటించిన అమ్మాయి చాలా బాగా చేసింది. CI పాత్రలో అనీష్ కురువిళ్ళ, జర్నలిస్ట్ పాత్రలో సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు, భద్రం, మేరీ పాత్రలో చేసిన అమ్మాయి వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. నేనింతే సినిమాలో మెప్పించిన హీరోయిన్ అదితి గౌతమ్ కానిస్టేబుల్ లక్ష్మి పాత్రలో అస్సలు సెట్ కాలేదు.
సాంకేతిక అంశాలు.. ఈ సినిమాకి డబ్బింగ్ చాలా మైనస్ అయింది. అనీష్ కురువిళ్ళ, జర్నలిస్ట్, ఝాన్సీ పాత్రకు వీళ్ళెవ్వరికి సొంత డబ్బింగ్ లేకపోవడంతో ఆ వాయిస్ లు అస్సలు సెట్ కాలేదు. ఇక శ్రీకాకుళం యాస కూడా చాలా మందికి సెట్ అవ్వలేదు. మెయిన్ లీడ్ వెన్నెల కిషోర్ పాత్రకు కూడా ఆ యాస అస్సలు సెట్ అవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హెవీగా అనిపిస్తుంది. పాటలు యావరేజ్. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. లొకేషన్స్, సెట్స్ కూడా ఆ కాలానికి తగ్గట్టు బాగానే సెట్ చేసుకున్నారు. ఒక మర్డర్ మిస్టరీని ఒక కమెడియన్ డిటెక్టివ్ ఎలా సాల్వ్ చేసాడు అనే కథని సస్పెన్స్ తో నడిపించడానికి ట్రై చేసారు రైటర్, డైరెక్టర్ మోహన్. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్’ సినిమా ఓ కామెడీ డిటెక్టివ్ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించాడు అని సస్పెన్స్ కథాంశంతో చెప్పడానికి ప్రయత్నించారు. ఈ సినిమాకు 2 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.