Vijay Deverakonda : గేమింగ్ యాప్‌నే ప్రమోట్ చేశా.. బెట్టింగ్ యాప్స్ కాదు : విజయ్ దేవరకొండ
సినీ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ముగిసింది.
- Thota Vamshi Kumar
- Published On : August 6, 2025 / 03:47 PM IST
Vijay deverakonda ed interrogation complete
సినీ నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ముగిసింది. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విజయ్ దేవరకొండను ఈడీ అధికారులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లు వంటి విషయాలపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. విజయ్ దేవరకొండ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను అధికారులు పరిశీలించారు. ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాల్లోనూ విచారణ కొనసాగింది.
ఇప్పటికే ఈ కేసులో నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈ నెల 11న విచారణకు రావాలని రానాకు, 13న విచారణకు రావాలని మంచు లక్ష్మీకి నోటీసులు ఇచ్చారు.
విచారణ అనంతరం విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు. ఈడీకి అన్ని వివరాలు ఇచ్చినట్లు చెప్పారు. తాను గేమింగ్ యాప్‌కు మాత్రమే ప్రమోట్ చేశానని చెప్పారు. ‘దేశంలో బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్.. ఇలా రెండు రకాలు ఉన్నాయి. నేను A23 అనే గేమింగ్ యాప్‌ని ప్రమోట్ చేశానని క్లారిటీ ఇచ్చాను. బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌కి సంబంధం లేదు. గేమింగ్ యాప్స్ చాలా రాష్ట్రాల్లో లీగల్. గేమింగ్ యాప్స్‌కి జీఎస్టీ, టాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్ ఉంటాయి. నా బ్యాంకు లావాదేవీల వివరాలన్నీ ఈడీకి సమర్పించా. నేను ప్రమోట్ చేసిన A23 యాప్ తెలంగాణలో ఓపెన్ కాదు. నేను లీగల్ గేమింగ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశా. సంబంధిత కంపెనీతో నేను చేసుకున్న ఒప్పందం వివరాలూ ఈడీకి వెల్లడించా.” అని విజయ్ దేవరకొండ తెలిపారు.
