The Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బాగానే ఉన్నా ట్రోలింగ్ ఎందుకు? కావాలనే నెగిటివిటీ? రంగంలోకి దిల్ రాజు..

ఫ్యామిలీ స్టార్ పై కావాలనే నెగటివిటీ తీసుకు వస్తున్నారా..? రంగంలోకి దిగిన దిల్ రాజు...

Vijay Deverakonda Family Star Movie Trolling Dil Raju taking Family Audience Reviews directly from Theaters

The Family Star : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురాం దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఏప్రిల్ 5న థియేటర్స్ లో గ్రంగ్ గా రిలీజయింది. ముందు నుంచి కూడా ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా నచ్చుతుంది, ఫ్యామిలీ సినిమా అని, ఫ్యామిలీ వ్యాల్యూస్ గురించి చెప్పే సినిమా అని ప్రమోట్ చేస్తూ వచ్చారు. గీతగోవిందం కాంబోలో సినిమా కావడం, మృణాల్ వరుస హిట్స్ తో ఉండటం, దిల్ రాజు దగ్గరుండి ప్రమోషన్స్ బాగా చేయడంతో ఫ్యామిలీ స్టార్ సినిమాపై రిలీజ్ ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తన ఫ్యామిలీ కోసం నిలబడటం, బాధ్యతలతో బతకడం, అతని మిడిల్ క్లాస్ తత్వాన్ని ప్రశ్నించేలా హీరోయిన్ ఓ పని చేయడంతో లైఫ్ లో ఎదగాలని కసితో కష్టపడటం లాంటి ఓ మంచి కథతో సినిమాని తెరకెక్కించారు. సినిమాలో ఒక రెండు మూడు సీన్స్ కొంచెం లాజిక్ లెస్ గా ఉన్నా, సెకండ్ హాఫ్ లో కొంచెం సాగతీత ఉన్నా సినిమా పరంగా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.

ఫ్యామిలీ స్టార్ సినిమా చాలా మందికి నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్స్ బయటకి వచ్చి బాగుందనే చెప్తున్నారు. కానీ కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ పై నెగిటివ్ రివ్యూలు ఇస్తూ, ఫ్యామిలీ స్టార్ బాలేదని కామెంట్స్ చేస్తున్నారు. పలువురు యూట్యూబ్ రివ్యూయర్లు కూడా ఫ్యామిలీ స్టార్ బాలేదంటూ రివ్యూలు ఇచ్చారు. కొంతమందికి విజయ్ చూపించే యాటిట్యూడ్, అతను మాట్లాడే తీరు నచ్చకపోవడంతో అతని సినిమా ఏది వచ్చినా నెగిటివ్ ట్రోలింగ్స్ చేస్తారు. దీంతో విజయ్ పై ఉన్న నెగిటివిటి కూడా ఫ్యామిలీ స్టార్ సినిమా మీద చూపిస్తున్నారు.

Also read : Dil Raju : ‘ఫ్యామిలీ స్టార్’ రివ్యూల కోసం.. స్వయంగా మైక్ పట్టుకొని థియేటర్స్ ముందుకెళ్లిన దిల్ రాజు..

ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూసి బాగుందని చెప్పడం, అటు సోషల్ మీడియాలో సినిమా బాలేదని పలువురు ప్రమోట్ చేస్తుండటంతో ఫ్యామిలీ స్టార్ రెండు రోజులు నుంచి చర్చగా మారింది. ఇలా నెగిటివ్ గా ప్రమోట్ చేయడం సినిమా మీద కచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆ నెగిటివిటీ ఆపకపోయినా సోషల్ మీడియా వాడే యూత్ మాత్రం నిజంగానే సినిమా బాలేదా అని సందేహిస్తూ సినిమాకి వెళ్లడం ఆగిపోతారు. దీంతో సినిమా కలెక్షన్స్ కి లాస్ అయినట్టే.

దీంతో ఈ నెగిటివిటీని ఆపాలని, ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంతగా నచ్చిందో చెప్పడానికి నిర్మాత దిల్ రాజు స్వయంగా రంగంలోకి దిగారు. రివ్యూస్ ను పట్టించుకోకుండా తానే స్వయంగా వెళ్లి జనాల అభిప్రాయం తెలుసుకోడానికి థియేటర్స్ బాట పట్టారు దిల్ రాజు. ఓ రకంగా చెప్పాలంటే సినిమాని బతికించడానికి ఇప్పటి వరకు ఏ నిర్మాత చేయని పని దిల్ రాజ్ చేస్తున్నారు. దిల్ రాజు మైక్ పట్టుకొని తనే సినిమా చూసిన ప్రేక్షకుల అభిప్రాయం అడుగుతుండటంతో ఇది టాలీవుడ్ లో సంచలనంగా మారింది.

ఇక దిల్ రాజు ఇలాంటి నెగిటివిటీపై కూడా స్పందించారు. మీడియా ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. నాకు యుఎస్ నుంచి కూడా పాజిటివ్ టాక్ తో మెసేజ్ లు వచ్చాయి. చాలా మంది ఫ్యామిలీస్ నాకు మెసేజ్ లు, కాల్స్ చేసి సినిమా బాగుందని చెప్తున్నారు. మేము ఈ సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీసాము, ఆ టార్గెట్ రీచ్ అయ్యాము. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుంది. రివ్యూస్ ఇంకోలా ఉండొచ్చు. మేము ఆ రివ్యూస్ ని కూడా పరిగణలోకి తీసుకుంటాము. కొంతమంది సినిమా చూసిన ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమా నచ్చి మా టీమ్ కు సత్కారం చేస్తామంటే సంతోషంగా ఒప్పుకుని రమ్మని చెప్పాము. కొంతమంది మీడియా మిత్రులు కూడా వాళ్ళ ఫ్యామిలీలు ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేశారు అని తెలిపారు. సినిమాలో బామ్మా – మనవడు, అన్న – తమ్ముడు.. ఇలా ప్రతి రిలేషన్ లోను ఒక ఎమోషన్ ఉంది. వీటన్నిటికంటే ఓ మధ్యతరగతి ఎమోషన్ కి చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు