మెగా డైరెక్టర్ బాపినీడు కన్నుమూత

  • Publish Date - February 12, 2019 / 04:59 AM IST

హైదరాబాద్: ప్రముఖ తెలుగు చలన  చిత్ర నిర్మాత, దర్శకుడు విజయబాపినీడు మరణించారు. ఆయన వయస్సు  83 సంవత్సరాలు .  విజయబాపినీడుగా సుపరిచితులైన ఆయన అసలు పేరు గుత్తా  బాపినీడు చౌదరి.  తను సంపాదకత్వం వహించిన పత్రిక పేరుతోనే విజయబాపినీడుగా ప్రసిధ్దిచెందారు.  గత కొద్ది రోజులుగా  అనారోగ్యంతో ఆయన బాధ పడుతూ హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు.  1936  సెప్టెంబర్ 22న పశ్చిమ గోదావరి జిల్లా  చాటపర్రులో జన్మించిన ఆయన ఏలూరు సీఆర్ రెడ్డి కాలేజీలో బీఏ మ్యాధ్స్ చేశారు.  చిరంజీవి, శోభన్ బాబులతో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. చిరంజీవి  కేరీర్ లో మైలురాయిగా నిలచిన గ్యాంగ్ లీడర్ సినిమాకు దర్శకత్వం వహించారు. చిరంజీవితో  గ్యాంగ్ లీడ‌ర్, ఖైదీ నెం 786, మ‌గ‌ధీరుడు, వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ని తెలుగు ప‌రిశ్ర‌మ‌కి అందించారు.

సినిమాల్లోకి రాకపూర్వం డిటెక్టివ్ నవలా రచన తో జీవితాన్ని ప్రారంభించిన ఆయన విజయ, బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పని చేశారు.  చిరంజీవి పేరుతో ఒక పత్రికను కూడా కొంతకాలం విజయబాపినీడు ప్రచురించారు. 1980వ దశకంలో  విజయ  మాస పత్రిక పాపులర్ మంత్లీ  మ్యాగజైన్ గా పాఠకులను విశేషంగా ఆకట్టుకుంది.  చిన్నపిల్లల కోసం బొమ్మరిల్లు  పేరుతో ఒక మాసపత్రికను కూడా ప్రచురించారు.

విజయ బాపినీడు ద‌ర్శ‌కుడిగా డబ్బు డబ్బు డబ్బు (1981),పట్నం వచ్చిన పతివ్రతలు (1982),మగమహారాజు (1983), మహానగరంలో మాయగాడు (1984), హీరో (1984), భార్యామణి (1984), మహారాజు (1985), కృష్ణగారడి (1985), మగధీరుడు (1986), నాకు పెళ్ళాం కావాలి (1987), ఖైదీ నెంబరు 786 (1988), దొంగకోళ్ళు (1988), మహారజశ్రీ మాయగాడు (1988), జూలకటక (1989), మహాజనానికి మరదలు పిల్ల (1990), గ్యాంగ్ లీడర్ (1991), బిగ్ బాస్ (1995), కొడుకులు (1998), ఫ్యామిలీ (1994) వంటి చిత్రాలు  చేశారు. నిర్మాతగా యవ్వనం కాటేసింది (1976) అనే చిత్రం  నిర్మించారు.