Kaalamega Karigindhi : ‘కాలమేగా కరిగింది’ మూవీ రివ్యూ.. అచ్చ తెలుగులో తొలి ప్రేమ కథ..
కాలమేగా కరిగింది ఒక అచ్చ తెలుగు సినిమా అని చెప్పొచ్చు.

Vinay Kumar Aravind Shravani Nomina Thara Kaalamega Karigindhi Movie Review and Rating
Kaalamega Karigindhi Movie Review : వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార.. ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘కాలమేగా కరిగింది’. కలహాలే లేని ఓ ప్రేమకథ ట్యాగ్ లైన్. శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మాణంలో శింగర మోహన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. పూర్తి పొయిటిక్ స్టైల్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నేడు మార్చ్ 21న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. ఫణి(వినయ్ కుమార్/ చైల్డ్ ఫణి – అరవింద్) లైఫ్ లో సక్సెస్ అయినా ఏదో వెలితిగా ఉంటాడు. తన జీవితంలో ఉన్న తొలి ప్రేమ, ఏకైక ప్రేమ బిందు(శ్రావణి/ చైల్డ్ బిందు – నోమిన తార) గుర్తొస్తుంది. తన టెన్త్ క్లాస్ లో బిందుతో తన ప్రేమ, స్కూల్ లో ఇద్దరూ కలిసి చేసిన ప్రేమ ప్రయాణం, తర్వాత విడిపోవడం, తను ఇంకా ఎదురుచూస్తాను అని చెప్పడం.. ఇవన్నీ గుర్తొచ్చి తన ఊరికి, స్కూల్ కి వెళ్తాడు. అక్కడ తన జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటాడు.
టెన్త్ తర్వాత ఫణి – బిందు విడిపోయినా కొన్నాళ్ల పాటు ఉత్తరాలతో మాట్లాడుకుంటారు. డిగ్రీ అయిపోయిన సమయంలో ఓ క్యాసెట్ పంపిస్తుంది బిందు. కానీ అది వినడు. ఇన్నాళ్ల తర్వాత ఫణి తన ఊరికి వచ్చి తన ఇంట్లో ఆ క్యాసెట్ కనపడటంతో వింటాడు. ఆ క్యాసెట్ విన్నాక బిందు ఇంకా తన కోసం వేచి చూస్తుంది అని ఫిక్స్ అయి ఎలాగైనా తనని కలవాలి అనుకుంటాడు. మరి టెన్త్ తర్వాత దూరమయిన ఫణి – బిందు మళ్ళీ కలిశారా? ఆ క్యాసెట్ లో ఏముంది? అసలు ఫణి – బిందు ఎందుకు దూరమయ్యారు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
సినిమా విశ్లేషణ.. ఈ సినిమా అంతా కవితాత్మకంగా ఉంటుందని ముందే చెప్పారు. ఓ వ్యక్తి తన జీవితంలో ఉన్న ఒకేఒక ప్రేమ కథ, మొదటి ప్రేమ కథ గురించి గుర్తు తెచ్చుకోవడం, ఆ ప్రేమని ఎలా కలిసాడు అనే ఈ కాలమేగా కరిగింది సినిమా. ఫస్ట్ హాఫ్ లో ఫణి లైఫ్ లో సక్సెస్ అయ్యాడు అని కొన్ని మాటల్లో చెప్పేసి స్కూల్ లవ్ స్టోరీకి వెళ్ళిపోతారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫణి – బిందు ఎలా ప్రేమలో పడ్డారు అని చూపించి ఇంటర్వెల్ సింపుల్ గా ఇచ్చేస్తారు. ఇక సెకండ్ హాఫ్ లో బిందు – ఫణి ఇంకెంత దగ్గరయ్యారు, ఎలా దూరమయ్యారు, మళ్ళీ వాళ్ళు కలిశారా లేదా అని చూపిస్తారు. క్లైమాక్స్ వాళ్ళు కలుస్తారా, ఎలా కలుస్తారు అనే టెన్షన్ బాగా బిల్డ్ చేసారు.
కాలమేగా కరిగింది ఒక అచ్చ తెలుగు సినిమా అని చెప్పొచ్చు. సినిమా అంతా ఆల్మోస్ట్ ఇంగ్లీష్ పదాలు లేకుండా పూర్తి తెలుగులో కవితాత్మకంగా ఉంటాయి డైలాగ్స్. సగం సినిమా వాయిస్ ఓవర్ నేరేషన్ లోనే ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్, థ్రిల్లర్, ఎంటర్టైన్మెంట్ సినిమాలు చూసేవారికి ఈ సినిమా నచ్చకపోవచ్చు. కానీ తెలుగు భాషాభిమానం, ప్యూర్ లవ్ స్టోరీలు చూసేవారికి బాగా నచ్చేస్తుంది. గతంలో ఇదే ఫ్లేవర్ లో షార్ట్ ఫిలిమ్స్ చాలా వచ్చాయి. ఈ సినిమా కూడా కొంతవరకు షార్ట్ ఫిలింలానే అనిపిస్తుంది. సినిమా అయిపోతుంది అనుకునేలోపు ప్రీ క్లైమాక్స్ కాస్త సాగదీశారు. సినిమా అంతా స్లో నేరేషన్ లోనే ఉంటుంది. ఒక ఫ్రెష్ ఫీలింగ్ తో ప్యూర్ స్కూల్ లవ్ స్టోరీ చూడాలంటే కాలమేగా కరిగింది చూడాల్సిందే. స్కూల్ లో మనకు క్రష్ కానీ లవ్ స్టోరీ ఉంటే ఈ సినిమా చూస్తే కచ్చితంగా అది గుర్తొస్తుంది. మన స్కూల్ డేస్ గుర్తొస్తాయి.
నటీనటుల పర్ఫార్మెన్స్.. స్కూల్ జంటగా అరవింద్ – నోమిన తార నటించారు. సినిమా అంతా ఆల్మోస్ట్ ఈ ఇద్దరి మధ్యే జరుగుతుంది. స్కూల్ ప్రేమికులుగా ఇద్దరూ అదరగొట్టేసాడు. చాలా క్యూట్ గా నటించి అద్భుతంగా మెప్పించారు. స్కూల్ లో ఫ్రెండ్ పాత్రలో రాజు అక్కడక్కడా నవ్విస్తాడు. పెద్దయ్యాక ఫణి పాత్రలో వినయ్ కుమార్ సైలెంట్ గా ఉంటూ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేసాడు. శ్రావణి ఒక్క సీన్ లో కనిపించి సింపుల్ గా మెప్పించింది. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపిస్తారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మాములు సీన్స్ ని కూడా పొయిటిక్ గా చూపించారు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ప్రతి సీన్ కి ఇచ్చిన మ్యూజిక్ ఫ్రెష్ ఫీల్ వస్తుంది. సినిమా అంతా రెండు, మూడు లొకేషన్స్ లోనే సింపుల్ గా పూర్తి చేసేసారు. డబ్బింగ్ కూడా చాలా బాగా చెప్పారు. ఆ డైలాగ్స్ కి తగ్గట్టు పొయిటిక్ గా ఆ వాయిస్ లు కూడా బాగా సెట్ అయ్యాయి. సినిమాకు మరో ప్లస్ డైలాగ్స్. ప్రతి డైలాగ్, ప్రతి పదం అచ్చ తెలుగులో పూర్తి కవితాత్మకంగా చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. దర్శకుడి సాహిత్యాన్ని మాత్రం మెచ్చుకోవలసిందే. నిర్మాణ పరంగా కూడా చిన్న బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు.
మొత్తంగా ‘కాలమేగా కరిగింది’ సినిమా సక్సెస్ అయిన ఓ వ్యక్తి తన జీవితంలోని ఏకైన, మొదటి ప్రేమకథని గుర్తు చేసుకొని ఆ అమ్మాయిని కలిశాడా లేదా అని ప్రేమ కావ్యంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.