Vishwak Sen Mechanic Rocky Movie Review and Rating Here
Mechanic Rocky Movie Review : విశ్వాక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా మెకానిక్ రాకీ. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాణంలో రవితేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. సునీల్, నరేష్, రఘురాం, వైవా హర్ష.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. మెకానిక్ రాకీ సినిమా నేడు నవంబర్ 22న థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. రాకీ అలియాస్ రాకేష్(విశ్వక్ సేన్) తన తండ్రి(నరేష్) మెకానిక్ గ్యారేజీతో పాటు డ్రైవింగ్ స్కూల్ నడిపిస్తుంటాడు. అతని గ్యారేజీని రంకి రెడ్డి(సునీల్) కబ్జా చేసి వేరే వాళ్లకు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. రాకీ తన గ్యారేజిని కాపాడుకోవడానికి 25 లక్షలు కట్టాల్సి వస్తుంది. అదే సమయంలో మాయ(శ్రద్ధ శ్రీనాథ్) ఓ ఇన్స్యూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాను అంటూ డ్రైవింగ్ నేర్చుకోవడానికి రాకీ దగ్గరకు వస్తుంది.
డ్రైవింగ్ నేర్పించే క్రమంలో మాయ రాకీ కథ అడగడంతో.. తన తాత ఓ కామెడీ ఫ్యాక్షనిస్ట్ అని, రాయలసీమ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయ్యాడని, కాలేజీలో ప్రియ(మీనాక్షి చౌదరి)ని ప్రేమించానని, కాలేజీ చదువు మధ్యలోనే ఆపేయడం, చాన్నాళ్లకు ప్రియ మళ్ళీ కనపడి తన దగ్గరికి డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడం, రాకీ బెస్ట్ ఫ్రెండ్, ప్రియ అన్నయ్య(విశ్వదేవ్) చనిపోయాడని తెలియడం, తన గ్యారేజికి ఉన్న సమస్యలు, తన తండ్రి చనిపోవడం.. ఇలా తన గురించి మొత్తం చెప్తాడు. గ్యారేజీ కూల్చే సమయానికి మాయ రాకీ వాళ్ళ నాన్న పేరు మీద 2 కోట్లు ఇన్స్యూరెన్స్ ఉందని ఫోన్ చేస్తుంది. మరి రాకీకి వాళ్ళ నాన్న ఇన్స్యూరెన్స్ డబ్బులు వచ్చాయా? రాకీ గ్యారేజీ సమస్య ఏంటి? చచ్చిపోయిన రాకీ తాత రాకీకి ఎలా హెల్ప్ అయ్యాడు? ప్రియ వాళ్ళ అన్నయ్య ఎలా చనిపోయాడు? ప్రియ – రాకీల ప్రేమ ఏమైంది తెలుసుకోవాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Mohan Babu : నటుడిగా మోహన్ బాబు 50 ఏళ్ల సినీ ప్రయాణం..
సినిమా విశ్లేషణ.. ఫస్ట్ హాఫ్ అంతా హీరో పాత్ర, మాయ పరిచయం అవ్వడం, హీరో గ్యారేజీ కష్టాలు, నాన్న చనిపోవడం చూపించి ఇంటర్వెల్ కి ఓ ట్విస్ట్ ఇచ్చినట్టు అనిపించినా సింపుల్ గానే ముగించారు. ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా రెగ్యులర్ కమర్షియల్ సాగదీసిన సినిమాలానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత ఓ రెండు ట్విస్టులతో కథని మలుపుతిప్పి వేగవంతంగా కథని నడిపించారు. ప్రమోషన్స్ లో కొత్త కథ, కొత్త ట్విస్టులు ఉంటాయంటూ ట్రైలర్స్, టీజర్స్ లో కూడా సింపుల్ గానే కథని చూపించారు.
తీరా సినిమా చూసాక అవి రెగ్యులర్ ట్విస్టులే. రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్ళు ఆ ట్విస్టులను ఈజీగానే కనిపెట్టేస్తారు . అసలు మొదటి ట్విస్ట్ తెలియగానే రెండో ట్విస్ట్ అర్థమయిపోతుంది. అసలు ఈ ట్విస్టులకు సంబంధించి ఓపెనింగ్ షాట్ లోనే ఓ లీడ్ ఇచ్చేస్తాడు డైరెక్టర్. దీంతో అసలు కథేంటి అని ఈజీగానే అవగాహన వస్తుంది. సింపుల్ కథకి చాలా కష్టమైన స్క్రీన్ ప్లే వాడి కథని ముందుకు, వెనక్కు తీసుకెళ్తూ కొత్తగా చెప్పాలని ప్రయత్నించాడు డైరెక్టర్. ఎత్తుకు పై ఎత్తు అనే కాన్సెప్ట్ తో స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇక కామెడీగా వెళ్తున్న ట్రాక్ ని సడెన్ గా ఎమోషన్ చేసేస్తారు, ఎమోషన్ గా వెళ్తున్న ట్రాక్ ని సడెన్ గా కామెడీ చేసేస్తారు దీంతో ఆడియన్స్ కి అసహనం రాక తప్పదు. ఇక సినిమాలో చూపించింది ఒక స్కామ్ అయితే చెప్పడం ఏమో దానికి సంబంధం లేకుండా ఆన్లైన్ స్కామ్స్, సైబర్ స్కామ్స్ అంటూ మాట్లాడతారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. విశ్వక్ సేన్ అదే రొటీన్ యాక్టింగ్. గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాల్లో కొత్తగా ట్రై చేసి తన బెస్ట్ ఇచ్చిన విశ్వక్ ఈ సినిమాలో మళ్ళీ తన పాత కమర్షియల్ యాక్టింగ్ లోకే వెళ్ళిపోయాడు. శ్రద్ధ శ్రీనాథ్ మాత్రం క్యూట్ గా కనిపించి అలరిస్తూనే తన నటనతో కూడా మెప్పించింది. మీనాక్షి చౌదరి సింపుల్ గా కనిపించి తన పాత్రలో పర్వాలేదనిపించింది. నరేష్, వైవా హర్ష అక్కడక్కడా నవ్విస్తారు. హర్షవర్ధన్, రఘురాం, సునీల్, విశ్వదేవ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం రిచ్ గా బాగున్నాయి. ఈ సినిమాకు సరిపోదా శనివారం మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. ఆ సినిమాకు జేక్స్ ఎంత ప్లస్ అయ్యాడో ఈ సినిమాకు అంత మైనస్ అయ్యాడు. సరిపోదా శనివారం సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అటుతిప్పి ఇటుతిప్పి మళ్ళీ ఇదే సినిమాకు ఇచ్చాడు. ఇక పాటలు అయితే ఒక్క మంగ్లీ పాడిన సాంగ్ తప్ప మిగిలినవి అన్ని ఒక్కసారి కూడా వినలేం. కథ పరంగా కొత్తగా చెప్పాలని ట్రై చేసినా పాత స్క్రీన్ ప్లేనే వాడారు. దర్శకుడిగా మాత్రం రవితేజ మొదటి సినిమాతో బాగానే డీల్ చేసాడని చెప్పొచ్చు. నిర్మాణ పరంగా SRT ఎంటర్టైన్మెంట్స్ బాగానే ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘మెకానిక్ రాకీ’ ఓ స్కామ్ గురించి చెప్తూ తీసిన ఓ రెగ్యులర్ కమర్షియల్ కథ. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.