Movie Theaters: థియేటర్లు తెరుచుకొనేది ఎప్పుడు.. ఇండస్ట్రీలో పరిస్థితేంటి?

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది కానీ ఇంకా పూర్తిగా పోలేదు. ఆ మాటకొస్తే మహమ్మారి ఇప్పట్లో మన సమాజాన్ని వదిలేలా కనిపించడం లేదు. అయితే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కేసులు భారీగా తగ్గడంతో ప్రభుత్వాలు అన్నిటికీ అనుమతులిచ్చాయి. తెలంగాణలో సాధారణ జనజీవనం సాగుతుంది. టూరిజం నుండి విహారయాత్రల వరకు దేనికీ ఎలాంటి ఆంక్షలు లేవు.

Movie Theaters

Movie Theaters: కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది కానీ ఇంకా పూర్తిగా పోలేదు. ఆ మాటకొస్తే మహమ్మారి ఇప్పట్లో మన సమాజాన్ని వదిలేలా కనిపించడం లేదు. అయితే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కేసులు భారీగా తగ్గడంతో ప్రభుత్వాలు అన్నిటికీ అనుమతులిచ్చాయి. తెలంగాణలో సాధారణ జనజీవనం సాగుతుంది. టూరిజం నుండి విహారయాత్రల వరకు దేనికీ ఎలాంటి ఆంక్షలు లేవు. అయితే.. ఏపీలో మాత్రం ఇంకా పాక్షిక లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాలలో కేసులు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి.

దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సినిమా థియేటర్లు తెర్చుకొనేది ఎప్పుడు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. తెలంగాణలో సినిమా హాళ్లకు అనుమతిచ్చిన నెల రోజుల అనంతరమే ఏపీలో కూడా అనుమతి ఇచ్చారు. కానీ.. ఇప్పటికీ ఎక్కడా థియేటర్లు తెరుచుకోలేదు. ప్రభుత్వాల నుండి అనుమతులు ఉన్నా తెరుచుకోకపోవడానికి సవాలక్ష కారణాలున్నాయనిపిస్తుంది. నిజానికి జులై రెండో భాగంలో థియేటర్లు తీర్చుకుంటాయని.. ఆగష్టు మొదటి వారం నుండి కొత్త సినిమాల విడుదల ఉంటుందని అంచనా వేశారు.

కానీ.. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. అందుకే బడా నిర్మాత సురేష్ బాబు లాంటి వాళ్ళు సినిమాను ఓటీటీకి అమ్మేసుకున్నారు. థియేటర్లు తెరిచినా ప్రజలు వచ్చేందుకు సిద్ధంగా లేరని ఓ వాదన వినిపిస్తుంది. ఒకవైపు థర్డ్ వేవ్ భయంతో పాటు రకరకాల పేర్లతో వస్తున్న శక్తివంతమైన వేరియంట్లు ఇప్పుడు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో యధావిధిగా ప్రజలు థియేటర్లో కూర్చొని సినిమాను ఆనందించే పరిస్థితి లేకుండాపోయింది. పోనీ సీట్ల ఆక్యుపెన్సీ తగ్గించి ప్రదర్శన చేయాలంటే అందుకు థియేటర్ల యాజమాన్యం సిద్ధంగా లేదు.

ఇవే కాకుండా టికెట్ల రేట్ల మీద థియేటర్లు, ఎగ్జిబిటర్ల నుండి డిమాండ్లు.. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు వ్యతిరేకతతో పాటు.. ఒకవేళ మళ్ళీ కేసులు పెరిగితే ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానితో ఇప్పుడే థియేటర్లు తెరుచుకుంటాయా అనే అనుమానాలు కలిగిస్తున్నాయి. ఇప్పటికే ప్రేక్షకులు ఓటీటీలకు బాగా అలవాటు పడిపోగా ఇలాంటి పాండమిక్ పరిస్థితిలో రిస్క్ చేసే థియేటర్లకు వెళ్లడం అవసరమా అనే భావనలో ఉంటున్నారు. ఇక థర్డ్ వేవ్ పై రోజుకో విధంగా నిపుణుల హెచ్చరికలు కూడా ప్రేక్షకులను థియేటర్ల మీద ఆలోచన రానివ్వడం లేదు.

దీంతో అసలు థియేటర్లు ఎప్పుడు తీర్చుకుంటాయన్నదానిపై ఇండస్ట్రీలోనే ఇప్పటికీ కన్ఫ్యూజన్ నెలకొంది. ఇప్పటికే పలుమార్లు ఈ అంశంపై చర్చలు జరిపిన సినీ పెద్దలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఒకవేళ ఒక నిర్ణయానికి వచ్చి థియేటర్లను తెరిచినా ప్రేక్షకులలో స్పందనను బట్టే కొత్త సినిమాల విడుదలకు అవకాశం ఉంటుంది. దీంతో అప్పటి వరకు థియేటర్ల నిర్వహణ మరింత భారమయ్యే అవకాశాలున్నాయి. ఈలోగా కేసులు పెరిగితే మళ్ళీ వ్యవహారం మొదటికి వస్తుంది. అందుకే.. వెండితెర మీద కొత్త బొమ్మ పడేది ఇప్పుడా అన్నదానిపై ఎలాంటి స్పష్టత లేకుండాపోతుంది.