100 Covid Vaccination Jummu And Kashmir Weyan Village Is Indias First To Inoculate All Adults
First in India 100 % vaccination complete village : కరోనాను నివారించటానికి దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతీ గ్రామంలోనే వ్యాక్సినేషన్ జరుగుతోంది. నూటికి నూరుశాతం వ్యాక్సినేషన్ మాత్రం ఇప్పటి వరకూ ఎక్కడ పూర్తికాలేదు. కొన్ని ప్రాంతాల్లో మొదటి డోస్ పూర్తి అయ్యి రెండో డోసులు ఇవ్వటం జరుగుతోంది. కానీ 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న గ్రామంగా రికార్డ్ క్రియేట్ చేసింది మంచు ప్రాంత గ్రామం వేయన్ గ్రామం. భారత్ లోనే మొట్టమొదటి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న గ్రామంగా నిలిచింది బందీపురా జిల్లాలోని వేయాన్ గ్రామం.
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ఓ చిన్న గ్రామం వేయన్. ఇండియాలో నూరు శాతం వ్యాక్సినేట్ అయిన ఊరుగా రికార్డు సృష్టించింది. బందీపురా జిల్లాకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేయన్ గ్రామం ఖాతాలోకి ఈ ఘనత సాధించింది. ఆ ఊరిలో ఉన్నవారంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు. చిన్నగ్రామమే అయినా 362 మంది వయోజనులు ఉన్నారు వేయన్ లో.
వేయన్ గ్రామానికి వెళ్లాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. సరైన రోడ్డు మార్గం లేదు. ఆ గ్రామానికి వెళ్లాలంటే 18 కిలోమీటర్ల దూరంలో కాలినడకనే వెళ్లాలి. అలా వేయాన్ గ్రామస్తుల కోసం హెల్త్ వర్కర్లు వ్యాక్సిన్లలను పట్టుకుని అంతదూరం నడిచి వెళ్లి మరీ గ్రామంలో ఉన్నవారందరికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. వేయాన్ గ్రామంలో ఉన్న వారంతా ప్రాచీన తెగలకు చెందినవారు. వీళ్లు ఎక్కువగా పశువుల పెంపకంమీద ఆధారపడి జీవిస్తుంటారు. వారి పశువుల్ని గ్రామం చుట్టూ ఉన్న ఎత్తైన కొండలకు వెళ్లి మేపుకుంటుంటారు. వారి పశువుల్లో ఎక్కువగా ఆవులు,గొర్రెలు ఉంటాయి. వేయాన్ గ్రామస్తులు ఎక్కువగా బయటి ప్రాంతాలకు రారు.
ఈక్రమంలో వేయన్ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవటంతో అక్కడకు వ్యాక్సిన్లు పట్టుకుని వెళ్లి వ్యాక్సినేషన్ చేయటం ఓ పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఎంత కష్టమైనా వారికి వ్యాక్సిన్ ఇవ్వటం బాధ్యతగా భావించిన ఆరోగ్యశాఖ అధికారులు కష్టపడి వేయాన్ గ్రామానికి వెళ్లి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. వేయాన్ కు ఇంటర్నెట్ సౌకర్యం లేదు. దీంతో వాళ్లు వ్యాక్సిన్ కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. అయినా సరే ఆ గ్రామానికి వెళ్లి అందరికి వ్యాక్సిన్లు వేశామని మెడికల్ ఆఫీసర్ బాషిర్ అహ్మద్ ఖాన్ తెలిపారు. కాగా దేశమంతా వ్యాక్సినేషన్ కొనసాగుతున్న క్రమంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం రూపొందించిన మోడల్ ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే 45 ఏళ్ల వయసు దాటిన వారిలో 70 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.