పాక్ జైలు నుంచి విడుదల : భారత్ చేరుకున్న 100 మంది జాలర్లు

పాకిస్తాన్ విడుదల చేసిన 100మంది భారత ఖైదీలు సోమవారం(ఏప్రిల్-8,2019)భారత్ కి చేరుకున్నారు.పంజాబ్ లోని అట్టారి-వాఘా సరిహద్దు గుండా వీరు భారత్ లోకి ప్రవేశించారు.పాకిస్తాన్ జైళ్లల్లో శిక్షలు అనుభవిస్తున్న 100మంది జాలర్లను ఆదివారం పాక్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడి తరువాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సందర్భంగా సుహృద్భావ చర్యగా పాక్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

నాలుగు దశలలో 360 మంది భారత ఖైదీలను (వీరిలో అత్యధికులు జాలర్లే)  విడుదల చేస్తున్నట్లు ఈ నెల 5న పాక్‌ ప్రకటించింది.ఈ నెల 15న రెండో దశలో మరో 100 మందిని, 22న మూడో దశలో మరో 100 మందిని విడుదల చేస్తామని పాక్‌ విదేశాంగ శాఖ కార్యాలయ ప్రతినిధి మహ్మద్‌ ఫైసల్‌ తెలిపారు. నాలుగో దశలో ఈ నెల 29న మిగిలిన 60 మందిని విడుదల చేస్తామని చెప్పారు.