100 సంవత్సరాల వయస్సున్న ఓ బామ్మ కరోనాని విజయవంతంగా జయించింది. అసోం రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గౌహతి సిటీలోని మదర్స్ ఓల్డ్ ఏజ్ హోం నివాసితురాలైన మై హ్యాండిక్(100) పది రోజులక్రితం కరోనా భారిన పడింది. చికిత్స నిమిత్తం గౌహతిలోని మహేంద్ర మోహన్ చౌదరి ఆస్పత్రిలో చేరింది.
కరోనాపై పోరాటంలో ఆమె వయస్సు ఒక సవాల్‌గా ఉన్నప్పటికీ తన సానుకూల స్పందన, కృతనిశ్చయంతో వ్యాధిని ఆమె జయించినట్లు డాక్టర్లు తెలిపారు. హాస్పిటల్ లో ఉన్న సమయంలో ఆమెకు… చేపలు, మాంసం, గుండ్లు, అరటిపండ్లు, చాపాతీలు, కూరగాయలు ఆహారంగా ఇచ్చేవాళ్లమని డాక్టర్లు చెప్పారు. ఆమె డిశ్చార్జ్ అయి వెళ్లేటప్పుడు వైద్యులు, నర్సులు చిన్నపాటి వేడుకను జరిపారు.
ఈ సందర్భంగా మై హ్యాండిక్ స్పందిస్తూ… తనకు చికిత్స అందించిన, సేవలు చేసిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ర్ట ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మకు ఆమె ప్రత్యేక ప్రశంసలు అందించారు. తమందరి కోసం మంత్రి చాలా కష్టపడుతున్నాడన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న ప్రజలకు సహాయం కొనసాగించాల్సిందిగా తాను ఆయనను ఆశీర్వదిస్తున్నట్లు చెప్పారు.
మదర్స్ ఓల్డ్ ఏజ్ ఆశ్రమానికి చెందిన 12 మంది వ్యక్తులు కోవిడ్-19 భారిన పడ్డారు. వీరిలో ఇప్పటివరకు ఐదుగురు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
కాగా,అసోంలో ఇప్పటివరకు 1,48,969కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, 511మరణాలు నమోదయ్యాయి.