Haryana Deaths Representative Image (Image Credit To Original Source)
Haryana Deaths: హర్యానా రాష్ట్రం పాల్వాల్ లోని చాయన్సాలో మరణాల కలకలం రేగింది. 15 రోజుల వ్యవధిలో 12 మంది చనిపోవడం సంచలనంగా మారింది. మృతుల్లో ఐదుగురు స్కూల్ విద్యార్థులు ఉండటం గ్రామస్తులను భయాందోళనకు గురి చేసింది. గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం, వాంతులతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. కాగా, తాగునీరు కలుషితం కావడమే దీనికి కారణమం అని అనుమానం వ్యక్తం చేశారు. 107 ఇళ్లలో వాటర్ శాంపిల్స్ సేకరించగా షాకింగ్ విషయం బయటపడింది. 23 చోట్ల బాక్టీరియా పెరుగుదల, క్లోరినేషన్ తక్కువగా ఉందని గుర్తించారు.
ఈ మరణాలపై ఆరోగ్య శాఖ దర్యాప్తు చేపట్టింది. జనవరి నెల చివరి నుండి ఫిబ్రవరి మధ్య జరిగిన మరణాలు తీవ్రమైన కాలేయ సంబంధిత సమస్యలతో ముడిపడి ఉన్నాయని ఆరోగ్య అధికారులు తెలిపారు. ప్రాథమిక పరిశోధనలు వైరల్ హెపటైటిస్, నీటి కాలుష్యాన్ని సూచించాయి.
చాయన్నా గ్రామంలో 865 ఇళ్లు ఉన్నాయి. 5వేల 700 మంది ప్రజలు ఉన్నారు. ఈ గ్రామంలో కామెర్లు సంబంధిత మరణాలు మొదట బయటపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఒక టీమ్ ని అపాయింట్ చేశారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇంటింటి సర్వేలు చేస్తున్నారు. గ్రామస్తులకు టెస్టులు చేస్తున్నారు.
జనవరి 27, ఫిబ్రవరి 11 మధ్య 7 మరణాలు సంభవించాయి. నాలుగు మరణాలు తీవ్రమైన హెపటైటిస్ లేదా కాలేయ వైఫల్యం కారణంగా సంభవించాయి. బాధితులు 9, 65 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. చాలామంది జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, కామెర్లు ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. వారి పరిస్థితి మరింత దిగజారింది.
గత నెలలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో విషపూరిత నీటి కారణంగా 16 మంది మరణించిన కొన్ని వారాల తర్వాత ఈ మరణాలు సంభవించాయి. ఇది దేశవ్యాప్తంగా కలుషితమైన తాగునీటి గురించి ఆందోళనలను రేకెత్తించింది.
”విస్తృతమైన స్క్రీనింగ్, పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు మరణించిన వారితో సన్నిహితంగా ఉన్నవారితో సహా దాదాపు 1,500 మందిని పరీక్షించారు. దాదాపు 800 మంది అవుట్ పేషెంట్ సంప్రదింపులు నిర్వహించబడ్డాయి. హెపటైటిస్ ఎ, బి, సి, ఇ లకు రక్త నమూనాలను పరీక్షించారు” పల్వాల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సతీందర్ తెలిపారు.
210 మందికి చేసిన రక్త పరీక్షల్లో రెండు హెపటైటిస్ బి పాజిటివ్ కేసులు, తొమ్మిది హెపటైటిస్ సి పాజిటివ్ కేసులు గుర్తించారు. మిగతా నమూనాలను పరీక్షించినప్పుడు హెపటైటిస్ ఎ, ఇ నెగటివ్‌గా వచ్చాయి.
ఇప్పటివరకు సేకరించిన 107 గృహ నీటి నమూనాల్లో 23.. నాణ్యత తనిఖీలు విఫలమయ్యాయి. ఇవి బ్యాక్టీరియా కాలుష్యం తగినంత క్లోరినేషన్ లేదని సూచిస్తున్నాయి. మరో రౌండ్ పరీక్ష చేయగా.. స్టోరేజ్ ట్యాంకులలో కోలిఫాం బ్యాక్టీరియా గుర్తించారు.
ఇక్కడి గ్రామ ప్రజలు నీటి సరఫరా కోసం భూగర్భ స్టోరేజ్ ట్యాంకులు, ట్యాంకర్లపై ఆధారపడతారు. రివర్స్ ఓస్మోసిస్-శుద్ధి చేసిన నీటిని పొరుగు ప్రాంతాల నుండి తీసుకొస్తున్నారు. సక్రమంగా రీఫిల్లింగ్ చేయకపోవడం, అండర్ గ్రౌండ్ ట్యాంకులను సరిగా క్లీన్ చేయకపోవడం వల్ల నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల భయాలు తలెత్తుతున్నాయి.
నివారణ చర్యగా నీటిని శుద్ధి చేసేందుకు సుమారు 15వేల హాలోజన్ మాత్రలు పంపిణీ చేశారు అధికారులు. అలాగే హెల్ప్‌లైన్ (01275-240022) నెంబర్ ఏర్పాటు చేశారు.
Also Read: జీతగాళ్లకు జాక్‌పాట్.. కొత్త ఆదాయపు పన్నుతో చేతికి ఎక్కువ జీతం? పూర్తి లెక్కలివే..!