అయ్యప్ప దర్శనానికి వచ్చిన 12 ఏళ్ల బాలికను అడ్డుకున్న పోలీసులు

  • Publish Date - November 19, 2019 / 08:11 AM IST

అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమల వచ్చిన 12 ఏళ్ల బాలికను కొండపైకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. నవంబర్19, మంగళవారంనాడు తమిళనాడులోని బేలూరుకు చెందిన బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకునేందుకు వచ్చింది. పంబ వద్ద మహిళా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే.. ఆ బాలిక వయసు నిర్ధారించే నిమిత్తం పోలీసులు ఆధారాలు పరిశీలించారు.

బాలిక వయస్సు 12 సంవత్సరాలుగా తేలటంతో ఆమె కొండపై దర్శనానికి వెళ్లటానికి అనుమతించలేదు. మిగిలిన కుటుంబ సభ్యులను కొండపైకి అనుమతించారు. అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై నిషేధాన్ని 1991లో కేరళ హైకోర్టు చట్టబద్ధం చేసింది.
 
2018, సెప్టెంబర్ 28న సుప్రీం కోర్టు అన్ని వయసుల మహిళలు ఆలయంలోకి ప్రవేశించవచ్చని, అయ్యప్పను పూజించవచ్చని తీర్పు చెప్పింది. దీంతో కొందరు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం, భక్తులు వారిని అడ్డుకోవడం..ఘర్షణ జరగడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ఏడాది  భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సుప్రీం తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై స్పష్టత వచ్చే వరకూ అన్ని వయసుల మహిళలకు అయ్యప్ప దర్శనం వీలుపడకపోవచ్చని ఈ ఘటనతో స్పష్టమైంది.

ట్రెండింగ్ వార్తలు