మహిళా టీచర్ల సాయంతో ఏడాదిగా బాలికపై స్కూల్ మేనేజర్, ఉపాధ్యాయులు అత్యాచారం

  • Publish Date - July 27, 2020 / 01:27 PM IST

రాజస్తాన్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో దారుణం జరిగింది. స్కూల్ మేనేజర్, ఉపాధ్యాయులు బరితెగించారు. 13ఏళ్ల బాలికను గ్యాంగ్ రేప్ చేశారు. మహిళా టీచర్ల సాయంతో ఏడాదిగా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్నారు. అల్వార్ జిల్లా నారాయణ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలే ఈ దారుణం వెలుగు చూసింది.

ఏడాదిగా బాలికపై లైంగిక దోపిడీ:
బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. స్కూల్ మేనేజర్, ఉపాధ్యాయులు సహా 13మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లతో పాటు పోక్సో చట్టం కింద కేసులు బుక్ చేశారు. స్కూల్ మేనేజర్, ఉపాధ్యాయులకు సహకరించిన ముగ్గురు మహిళా టీచర్లపైనా పోలీసుల కేసు నమోదు చేశారు. స్కూల్ మేనేజన్, ఉపాధ్యాయులతో పాటు కొంతమంది గ్రామస్తులు కూడా లైంగిక దాడికి పాల్పడినట్టు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మహిళా టీచర్ల సాయంతో దురాఘతం:
స్కూల్ లో చదివే బాలికపై కన్నేసిన మేనేజర్, ఉపాధ్యాయులు కొందరు మహిళా టీచర్లను మభ్యపెట్టారు. వారి సాయంతో బాలికను లొంగదీసుకున్నారు. ఏడాదిగా బాలికపై స్కూల్ మేనేజర్, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది, కొందరు గ్రామస్తులు లైంగిక దాడికి పాల్పడుతున్నారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బాలికను బెదిరించారు. దీంతో బాలిక మౌనంగా భరిస్తూ వచ్చింది. ఇటీవలే విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ అఘాయిత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పవిత్రమైన వృత్తికి కళంకం తెచ్చారు:
ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఉపాధ్యాయ వృతి ఎంతో పవిత్రమైనది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారు జీవితంలో ఎదిగేలా చూడాల్సిన బాధ్యత టీచర్ దే. తల్లిదండ్రుల తర్వాత అంతటి గౌరవం దక్కేది టీచర్లకే. ఉపాధ్యాయులను దైవంతో సమానంగా చూసే సంస్కృతి మనది. గురుదేవోభవ అంటారు. పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేది వారే. అలాంటి పవిత్ర వృత్తికి కొందరు నీచులు కళంకం తెచ్చారు. బాలికపై లైంగిక దోపిడీకి పాల్పడుతూ సభ్య సమాజం సిగ్గు పడేలా చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు.