భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తమిళనాడులో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రోజుకు వెయ్యికిపైగా కేసులు నమోదవుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈనేపథ్యంలో డాక్టర్ ఎమ్‌జీఆర్ మెడికల్ యూనివర్సిటీ ఎపిడెమాలజిస్ట్ దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించారు. కేసులు ఇదే సంఖ్యలో నమోదైతే (జూలై 15, 2020) నాటికి తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 1.5లక్షలుగా ఉంటుందని.. 1600 మంది మరణిస్తారని అంచనా వేశారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం తమ నివేదికలను ఉపయోగించుకుందని సదరు ఎపిడెమాలజిస్ట్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో వెల్లడించారు. విశ్వవిద్యాలయం ఏప్రిల్ 18 నుంచి తన అంచనాలను ప్రారంభించిందని.. మే మొదటి వారంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని తెలిపారు.
డాక్టర్ ఎమ్‌జీఆర్ మెడికల్ యూనివర్శిటీలోని ఎపిడెమియాలజీ విభాగం ప్రొఫెసర్, హెడ్ డాక్టర్ జి. శ్రీనివాస్ జూలై 15 నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1.5 లక్షలకు చేరుకుంటుందని.. అక్టోబర్ మధ్యలో గరిష్టంగా ఉంటుందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో తెలిపారు. తమ బృందం అంచనాల ప్రకారం (జూన్ 30, 2020) నాటికి తమిళనాడులో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1.3 లక్షలుగా ఉంటుందని.. మృతుల సంఖ్య 769కి చేరుకుంటుందని చెప్పారు. గురువారం (జూన్ 4, 2020) తమిళనాడులో ఒకే రోజు అత్యధికంగా 1,384 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ కేసుల సంఖ్య 27,256కు చేరుకోగా, మృతుల సంఖ్య 220కి చేరింది.
ఏప్రిల్ రెండో వారం నుంచి మే మొదటి 10 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య 3,097 నుంచి 5,442కు పెరుగుతాయని విశ్వవిద్యాలయం అంచనా వేసింది. దాని ప్రకారం మే 1-10 మధ్య కేసుల సంఖ్య 2,526 నుంచి 7,204 కు పెరిగాయని వాస్తవ గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాక మే 10నాటికి కరోనా మరణాల సంఖ్యను 38గా అంచనా వేయగా ఈ సంఖ్య 47గా ఉంది. ‘కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. దానికి అనుగుణంగా తగినన్ని పడకలు, ఐసోలేషన్ సదుపాయాలు, ఐసీయూలు వంటి కీలకమైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది’ అని శ్రీనివాస్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో అన్నారు.
చెన్నైకి సంబంధించి విశ్వవిద్యాలయం ఖచ్చితమైన అంచనాలు వేసింది. మే 25 నాటికి 83 మరణాలను అంచనా వేయగా.. ఇది వాస్తవమైంది. అంతేకాక కేసుల సంఖ్యను 11,119గా అంచనా వేయగా.. వాస్తవంగా కేవలం 12 కేసులు తక్కువ నమోదయ్యాయి. జూన్ 3న వరకు 17,738 కేసులు, 156 మరణాలు సంభవిస్తాయని తెలపగా.. వాస్తవంగా 17,598 కేసులు,153 మరణాలు నమోదయ్యాయని తెలిపారు.
Read: భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా మరణాలు..4రోజుల్లో 1000మంది మృతి