కిసాన్ రిపబ్లిక్ డే హింస కేసుల్లో 19 మంది అరెస్ట్, 25కు పైగా క్రిమినల్ కేసులు

19 arrested in Kisan Republic Day violence cases : కిసాన్‌ రిపబ్లిక్ పరేడ్‌లో హింసాత్మక ఘటనల కేసుల్లో 19మంది నిందితులను అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసు కమిషనర్ చెప్పారు. 25కు పైగా క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. మరోవైపు కిసాన్ పరేడ్‌లో గాయపడ్డ పోలీసులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరామర్శించనున్నారు. తీరథ్, సుశ్రుత్ ట్రామా సెంటర్లలో చికిత్స పొందుతున్న పోలీసులను పరామర్శిస్తారు. ఎర్రకోటను కూడా అమిత్ షా సందర్శించే అవకాశం ఉంది. రిపబ్లిక్‌ డే రోజున ఢిల్లీలో ఆందోళనకారులు చేసిన దాడిలో 394 మంది పోలీసులు గాయపడ్డారు.

మరోవైపు రైతు సంఘాల్లో చీలిక రావడంతో కొందరు ఆందోళన విరమించారు. టెంట్లు తీసేసి చిల్లా సరిహద్దులను ఖాళీ చేశారు రైతులు. నిన్నటిదాకా రైతుల ఆందోళనలతో నిండిపోయిన ప్రాంతమంతా ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది. పోలీసుల బారికేడ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో యూపీ-నోయిడా నుంచి ఢిల్లీ వైపు రాకపోకలు అనుమతిస్తున్నారు. టిక్రి సరిహద్దుల్లో మాత్రం రైతుల ఆందోళన కొనసాగుతోంది.

మరోవైపు అన్నదాతల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ దద్దిరిల్లుతుంది. పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా భద్రతా వలయాన్ని దాటుకొని ఎర్రకోటలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఎర్రకోటపైకిఎక్కి రైతు జెండాలను ఎగురవేశారు.

కేంద్రానికి రైతులు కొత్త అల్టిమేటం జారీ చేశారు. మూడు అగ్రిచట్టాలను రద్దు చేసేవరకు సిటీ వదిలి వెళ్లే ప్రసక్తే లేదన్నారు. సాయంత్రం ఐదు గంటల వరకూ రైతుల ర్యాలీకి అనుమతి ఉండడంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు దిల్లీ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

కిసాన్‌ గణతంత్ర పరేడ్‌కు అనుమతిచ్చిన మార్గాలను దాటి రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ఎంటరయ్యారు. పలుచోట్ల బారికేడ్లను ధ్వంసం చేశారు. ఇండియా గేట్‌, రాజ్‌పథ్‌, రాజ్‌ఘాట్‌ వైపు వెళ్లకుండా రైతులను నిలువరించేందుకు భద్రతా దళాలు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించాయి. అయినప్పటికీ రైతులు చివరకు ఎర్రకోటను చేరి జెండాలు ఎగురవేశారు.