Hyderpora Encounter : శ్రీనగర్ ఆపరేషన్ లో ఇద్దరు వ్యాపారవేత్తలు మృతి..న్యాయవిచారణకు ముఫ్తీ డిమాండ్

జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్‌లో సోమవారం సాయంత్రం భద్రతా బలగాలు జరిపిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో ఇద్దరు పాకిస్తాన్ టెర్రరిస్టులతో పాటు ఇద్దరు వ్యాపారవేత్తలు కూడా మరణించారు.

Kashmir (2)

Hyderpora Encounter  జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్‌లో సోమవారం సాయంత్రం భద్రతా బలగాలు జరిపిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో ఇద్దరు పాకిస్తాన్ టెర్రరిస్టులతో పాటు ఇద్దరు వ్యాపారవేత్తలు కూడా మరణించారు. గత సాయంత్రం శ్రీనగర్ లోని హైదర్‌పోరాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన ఇద్దరు వ్యాపారవేత్తలను.. డాక్టర్ ముదాసిర్ గుల్, అల్తాఫ్ భట్ గా గుర్తించారు. అయితే ఎన్ కౌంటర్ లో చనిపోయిన ఇద్దరు వ్యాపారవేత్తలు “ఉగ్రవాద మద్దతుదారులు” అని పోలీసులు తెలిపారు. డెంటల్ సర్జన్ అయిన “ముద్సిర్ గుల్” హైదర్‌పోరాలోని కమర్షియల్ కాంప్లెక్స్‌లో కంప్యూటర్ సెంటర్‌ను నడుపుతున్నాడు. అల్తాఫ్ భట్.. కమర్షియల్ కాంప్లెక్స్ యజమాని, అక్కడ హార్డ్‌వేర్ మరియు సిమెంట్ దుకాణాన్ని కూడా నడుపుతున్నాడు.

అయితే ఇద్దరు వ్యాపారవేత్తలను భద్రతా బలగాలు చంపేశాయని వారి కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఇద్దరికీ ఉగ్రవాదంతో ఎలాంటి సంబంధాలు లేవని, అంత్యక్రియల కోసం వారి మృతదేహాలను అప్పగించాలని భట్, గుల్ కుటుంబాలు అధికారులను అభ్యర్థించారు. అయితే వారిద్దరూ ఉగ్రవాదుల కాల్పుల్లో లేదా ఎదురుకాల్పుల్లో మరణించారని పోలీసులు చెబుతున్నారు. శాంతిభద్రతల పరిస్థితి కారణంగా మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించలేమని పోలీసులు తెలిపారు. శ్రీనగర్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని ఉత్తర కాశ్మీర్‌లోని హంద్వారా ప్రాంతంలో మొత్తం నాలుగు మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఈ ఇద్దరు వ్యాపారవేత్తల మరణంపై విచారణ జరిపించాలని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. అమాయక పౌరులను మానవ కవచాలుగా ఉపయోగించడం, క్రాస్ ఫైరింగ్‌లో వారిని చంపడం, ఆ తర్వాత సౌకర్యవంతంగా వారిని OGW(Over Ground Worker-ఉగ్రవాదులకు స్థానికంగా సాయం చేసేవాళ్లు)లుగా ముద్ర వేయడం  ఇప్పుడు GOI(భారత ప్రభుత్వం) రూల్‌బుక్‌లో భాగమైపోయిందని ముఫ్తీ అన్నారు. నిజాన్ని బయటకు తీసుకురావడానికి, ఈ ప్రబలమైన శిక్షార్హత సంస్కృతికి ముగింపు పలకడానికి విశ్వసనీయమైన న్యాయ విచారణ జరగడం అత్యవసరం అని ముఫ్తీ ట్వీట్ చేశారు.

కాగా,కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఈ ఎన్ కౌంటర్ పై మాట్లాడుతూ…ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో వ్యాపారవేత్త అల్తాఫ్ భట్ హతమయ్యాడు. పోస్ట్‌మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత అతనిని చంపిన బుల్లెట్ ఎవరు కాల్చారో తెలుస్తుందని తెలిపారు. తన భవనంలోని అద్దెదారుల గురించి అధికారులకు తెలియజేయనందున మరణించిన వారిని ఉగ్రవాదుల “హార్బరర్స్”(ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చినవారు)గా పరిగణించబడతారని విజయ్ కుమార్ తెలిపారు. “అతను అద్దెదారులను ఉంచాడు మరియు పోలీసులకు దాని గురించి ఎటువంటి సమాచారం లేదు. యజమాని యొక్క బాధ్యత స్థలాన్ని అద్దెకు ఇవ్వడంతో ముగియదు. అతను అక్కడ ఏమి జరుగుతుందో కూడా ఒకసారి తనిఖీ చేయాలి” అని విజయ్ కుమార్ అన్నారు.

ఇక,మరణించిన మరో వ్యాపారవేత్త ముద్సిర్ గుల్ తీవ్రవాదులకు సహచరుడు అని, అద్దె స్థలంలో అనధికారిక కాల్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడని ఐజీపీ తెలిపారు. కమర్షియల్ కాంప్లెక్స్‌లో నడుస్తున్న కాల్ సెంటర్‌ను ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారని పోలీసులు తెలిపారు. “ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పోలీసులలో ఒకరికి మెడకు గాయాలు అయిన జమలత్తా నుండి ముద్సిర్ గుల్ ఉగ్రవాదులను తన స్వంత కారులో తీసుకువచ్చి హైదర్‌పోరా వద్ద వదిలిపెట్టాడు” అని విజయ్ కుమార్ చెప్పారు.

ALSO READ Amaravati Capital: అమరావతి అంటే రైతులకు మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి రాజధాని