కిలో బంగారం అంటేనే.. అమ్మో అంటాం. అలాంటిది 25 కేజీల బంగారం దోపిడీ జరిగితే.. అది కూడా సినీ ఫక్కీలో.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు.. షాక్ నుంచి తేరుకునేలోపు బంగారం మాయం అయితే ఎలా ఉంటుందో చూపించారు దోపిడీ దొంగలు. ఇద్దరు వ్యక్తులు.. బైక్ పై వచ్చి చేసిన ఈ దోపిడీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్యూర్ గోల్డ్.. 24 కేరట్ల 25 కేజీల బంగారం బిస్కెట్ల దోపిడీ వివరాలు ఇలా ఉన్నాయి.
కేరళ రాష్ట్రం కొచ్చి ప్రాంతం. ఈదయార్ పారిశ్రామిక వాడలోని సీఆర్‌జీ మెటల్ ఫ్యాక్టరీకి కారులో బంగారాన్ని తరలిస్తున్నారు. కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. కొచ్చి సిటీ దాటిన తర్వాత కారు హైవే ఎక్కింది. కొద్దిదూరం వెళ్లిన వెంటనే.. కారును ఓవర్ టేక్ చేస్తూ ఓ బైక్ ముందుకెళ్లింది. అలా వెళ్లిన బైక్.. కొద్ది దూరంలోనే రోడ్డుకు అడ్డంగా పెట్టారు. ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు.. తుపాకులతో కారు దగ్గరకు వచ్చారు. కదిలితే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆ వెంటనే కారులోని సూట్ కేసుల్లో ఉన్న 25 కేజీల బంగారాన్ని తీసుకుని వెళ్లిపోయారు. వెళుతూ కారు తాళాలు, సెల్ ఫోన్లు తీసుకుని వెళ్లారు.
కేరళలోని కొచ్చిలో గురువారం(09 మే 2019) అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. ఉదయం వరకు వెయిట్ చేసి మరో వాహనంలో కొచ్చికి వచ్చి.. విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. చోరీకి గురైన బంగారం విలువ రూ. 6 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.
ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దోపిడీ తెలిసినవాళ్ల పనే అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. 25 కేజీల బంగారం తరలిస్తున్న విషయం వారికి ఎలా తెలుసు అనే కోణంలోనూ కూపీ లాగుతున్నారు. ఇది పక్కా స్కెచ్ అని.. సినీ ఫక్కీలో జరిగిందని అంటున్నారు పోలీసులు. వీలైనంత త్వరగా కేసును ఛేదించేపనిలో ఉన్నారు కేరళ కాప్స్…