2 more Jharkhand ministers flew to Chhattisgarh over poaching fears
Jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మరింత తీవ్రమవుతోంది. దీంతో అసెంబ్లీ సభ్యులు చెయ్యి జారకుండా ఉండేందుకు వారిని పరుగు పరుగున పక్క రాష్ట్రంలోని రిసార్టులకు పంపిస్తున్నారు. తాజాగా మరో ఇద్దరు మంత్రులు రాయ్‌పూర్ వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఇద్దరు నేతలు శుక్రవారం సాయంత్రం రాంచీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టుకి చేరుకున్నారు. అనంతరం అక్కడే ఒక ఖరీదైన రిసార్టులో వారికి వసతులు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
అధికార కూటమి(జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దళ్)లోని నేతలపై భారతీయ జనతా పార్టీ హార్స్ ట్రేడింగ్ ప్రారంభించిందనే కారణంతో ఎమ్మెల్యేలను ఇలా పొరుగు రాష్ట్రంలో దాచక తప్పడం లేదని అంటున్నారు. ఆగస్టు 30వ తేదీ నుంచి జార్ఖండ్ ఎమ్మెల్యేలంతా రాయ్‌పూర్ పయనం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు రాయ్‌పూర్‌లోని రిసార్టుల్లో ఉన్నారు. వారు ఉన్న చోటకే తాజాగా వెళ్లిన మంత్రులు వెళ్లినట్లు సమాచారం.
సెప్టెంబర్ 5న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బలపరీక్ష నిర్వహించనున్నారు. సరిగ్గా ఈ పరీక్షకు ముందే వారిని మళ్లీ రాంచీకి తీసుకురావాలని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారట. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మినహా మిగిలన వారంతా ఛత్తీస్‌గఢ్‌లోనే ఉన్నట్లు సమాచారం. సోరెన్ మాత్రం అక్కడే మకాం వేసి పరిస్థితుల్ని అంచనా వేస్తున్నట్లు చెప్తున్నారు.
81 స్థానాలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో అధికార కూటమికి 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పార్టీ అయిన జెఎంఎంకు చెందిన వారు 30, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 18 ఉండగా ఆర్జేడీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక విపక్ష బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ మిత్రపక్షం ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ అసోసియేషన్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. 41 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సోరెన్ గట్టెక్కుతారు. కానీ అధికార కూటమికి అంతకంటే ఎనిమిది మంది ఎక్కువే బలం ఉంది. అయినప్పటికీ మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఉదంతాల దృష్ట్యా ఏమైనా జరగొచ్చని అంటున్నారు.