కాలేజ్‌లకు వెళ్లే అమ్మాయిలే వారి టార్గెట్.. పేద, దిగువ మధ్య తరగతికి చెందిన అమ్మాయిలకు డబ్బు, లగ్జరీ లైఫ్ ఎర వేస్తారు. ఎరలో చిక్కిన వారితో ఉన్నత అధికారులను, రాజకీయ నాయకులను, ప్రముఖులను టార్గెట్ చేస్తారు. వారి లైంగిక వాంఛలు తీర్చేలా ఒత్తిడి చేసి.. పెద్ద పెద్ద కాంట్రాక్ట్ లను పడుతారు. మధ్యప్రదేశ్‌లో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే సంచలన నిజాలు వెలుగులోకి రాగా.. మధ్యప్రదేశ్ లో ఈ విషయం ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రకంపనలు రేపుతుంది.
దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేయగా.. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారి శ్వేత జైన్.. ఆమెకు సహకరించిన ఆర్తి దయాల్ గురించి సిట్ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు బయటకు వచ్చాయి. అసలు ఈ విషయం బయటకు ఎలా వచ్చిందంటే.. మోనికా యాదవ్(18)ది మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌గఢ్ గ్రామం. భోపాల్‌లోని ఓ ప్రముఖ కాలేజీలో చేరాలని భావించిన మోనికా.. ఇదే విషయమై శ్వేతా జైన్‌ను కలిసింది.
మోనిక తనను కలిశాక ప్రభుత్వంలో పెద్ద పెద్దోళ్లంతా తనకు తెలుసంటూ.. మధ్యప్రదేశ్ సచివాలయానికి తీసుకెళ్లింది శ్వేతా జైన్. అక్కడ ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు మోనికా యాదవ్ ను పరిచయం చేసింది. ఇండోర్ నుంచి రోజూ భోపాల్ రావడానికి ఆమెకు ఓ ఆడి కారు కూడా ఇచ్చింది. అయితే ఇందుకు ప్రతిగా తాను చెప్పిన వారికి పడక సుఖం అందించాలని మోనికను కోరింది శ్వేతా. దీనికి తిరస్కరించిన మోనికా యాదవ్.. తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయింది.
దీంతో రంగంలోకి దిగిన ఆర్తి దయాళ్.. తనను తాను సామాజిక కార్యకర్తగా మోనిక కుటుంబానికి పరిచయం చేసుకుంది. మోనికను భోపాల్ పంపిస్తే.. ఆమె చదువుకయ్యే ఖర్చంతా భరిస్తామని మోనిక తండ్రి హీరాలాల్‌ను నమ్మించింది. కుమార్తెకు మంచి చదువు చెప్పించే స్తోమత లేని తండ్రి అందుకు అంగీకరించాడు. కుమార్తె మోనికను ఆర్తి దయాళ్‌తో పంపాడు. దీంతో మళ్లీ భూపాల్ కు చేరుకున్న మోనికకు ఓ ఉన్నతాధికారితో శ్వేతా జైన్ పడక గదిలో ఉన్న వీడియోని ఆర్తి చూపించింది. జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలంటే ఇటువంటి పనులే చేయాలని చెప్పింది. శ్వేతా జైన్ మాటలకు పడిపోయిన మోనిక ఆమె చెప్పినట్లే చేయసాగింది. ఈ విషయాన్ని సిట్ విచారణలో మోనిక బయటపెట్టింది.
దీంతో శ్వేతా జైన్, ఆర్తి దయాళ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులకు ఇంతకంటే ఘోరమైన విషయాలు తెలిశాయి. మోనిక వంటి ప్రతిభావంతులైన, అందమైన ఎందరో అమ్మాయిలు వీరి ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ మేరకు పోలీసులకు దర్యాప్తులో కీలక ఆధారాలు దొరికాయి. మొత్తం 24మంది కాలేజ్ అమ్మాయిలను వాడుకుని వీళ్లు ఉన్నత అధికారులను ట్రాప్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. శ్వేతా జైన్ స్వయంగా సిట్ విచారణలో ఈ విషయాన్ని అంగీకరించింది. యువతలను ఎర వేసి వారితో యువతులు ఉన్న సమయంలో వీడియోలను వీళ్లు వీడియోలను తీస్తారని అధికారులు గుర్తించారు. వారి దగ్గర నుంచి భారీగా వీడియోలను, సీడీలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
అసలు మోనిక విషయం బయటకు ఎలా వచ్చిందంటే.. ఆగస్టు 30న ఆడీ కారులో ఆర్తి, ఆమె దగ్గర పనిచేసే రూప కలిసి మోనికను ఇండోర్ తీసుకెళ్లారు. అక్కడ ఇన్ఫినిటీ హోటల్‌లో రూమ్ తీసుకుని మోనికాకు ప్రభుత్వ ఇంజనీర్ 60ఏళ్ల హర్భజన్ సింగ్ ను పరిచయం చేశారు. రాత్రంతా హర్బజన్ సింగ్‌తో మోనిక కలిసి ఉండగా.. దానిని ఆర్తి వీడియో తీసి, మోనిక చేత రూ.3 కోట్లు డబ్బు డిమాండ్ చేయించింది. దీంతో మోనిక యాదవ్ అనే యువతి రూ. 3 కోట్లు ఇవ్వాలని, తన దగ్గర వీడియో ఉందంటూ బెదిరిస్తుందని హర్భజన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో మోనికను పోలీసులు అరెస్ట్ చేయగా.. అసలు విషయం మొత్తం బయటపడింది.