Airports privatisation : 2025 వరకు 25 ఎయిర్‌పోర్ట్‌ల ప్రైవేటీకరణ.. ఏపీలో 3 ఎయిర్‌పోర్టులు!

నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ కింద వచ్చే ఐదేళ్లలో 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వికె సింగ్ గురువారం లోక్‌సభలో తెలిపారు

Airports privatisation : భారత్‌లో ఎయిర్‌పోర్టుల్ని ప్రైవేటీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌లో (National Monetization Pipeline) భాగంగా మూడేళ్లలో 25 ఎయిర్‌పోర్టుల్ని ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ మానెటైజేషన్ పైప్‌లైన్‌లో భాగంగా 2022 నుంచి 2025 మధ్య దేశంలోని వేర్వేరు నగరాల్లో 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలియజేశారు.

విజయవాడ, రాజమండ్రి, తిరుపతి ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణ :
నాగపూర్, ఇండోర్, చెన్నై, వారణాసి, డెహ్రడూన్, తిరుచ్చి, భువనేశ్వర్, పాట్నా, కాలికట్, కొయంబత్తూర్‌తో పాటు 25 ఎయిర్ పోర్టుల ఆస్తుల్ని ప్రైవేటీకరిస్తామని ఆయన తెలిపారు. ఈ జాబితాలో ఏపీలోని మూడు ఎయిర్ పోర్టులు కూడా ఉన్నాయి. అందులో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి ఎయిర్ పోర్టులతో పాటు మదురై, రాంచీ, జోధ్‌పూర్, రాయ్‌పూర్, ఇంఫాల్, ఉదయ్‌పూర్, భోపాల్, అగర్తలా, వడోదర, అమృత్‌సర్, సూరత్, హుబ్లీ ఎయిర్ పోర్టులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించనుంది. ప్రైవేటీకరించే ఎయిర్‌పోర్టుల జాబితాను సిద్ధం చేసేందుకు వార్షిక రద్దీని కూడా పరిగణలోకి తీసుకున్నట్టు మంత్రి వీకే సింగ్ పేర్కొన్నారు. వార్షికంగా 0.4 మిలియన్ కన్నా ఎక్కువ ప్రయాణికుల రద్దీ ఉన్న ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించనున్నారు.

ముందుగా టైర్ 2, టైర్ 3 సిటీల్లో అమృత్‌సర్, ఇండోర్, రాయ్‌పూర్, వారణాసి, భువనేశ్వర్, తిరుచ్చి ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరణ చేయాలని AAI గుర్తించినట్టు కేంద్రం ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కొయంబత్తూర్, నాగ్‌పూర్, పాట్నా, మదురై, సూరత్, రాంచీ, కాలికట్, జోధ్‌పూర్ ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించనుంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏపీలోని తిరుపతి, విజయవాడ ఎయిర్‌పోర్టులను ప్రైవేటీకరించనుంది. అలాగే చెన్నై, రాజమండ్రి వడోదర, భోపాల్, హుబ్లీ ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించనుంది. ఇంఫాల్, అగర్తలా, డెహ్రడూన్ ఎయిర్‌పోర్టులను సైతం కేంద్రం ప్రైవేటీకరించనుంది. వచ్చే నాలుగేళ్లలో 25 విమానాశ్రయాల ఆస్తుల్ని అమ్మకం ద్వారా రూ.20,782 కోట్లు సేకరించనున్నట్టు 2021 ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Read Also : Bipin Rawat : బిపిన్‌ రావత్‌ జీవితాన్నే మార్చేసిన ‘అగ్గిపెట్టె’ సమాధానం

ట్రెండింగ్ వార్తలు