Tukaram Mundhe : 21 ఏళ్లలో 25 బదిలీలు.. ‘సింగం’గా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే.. ఆయన విద్యాభ్యాసం, సక్సెస్ స్టోరీ ఇదే!
Tukaram Mundhe : మహారాష్ట్రలో ‘సింగం’గా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే మరోసారి వార్తల్లో నిలిచారు.
- Harish Thanniru
- Published on- August 12, 2026 / 01:58 PM IST
Tukaram Mundhe
Tukaram Mundhe : మహారాష్ట్రలో ‘సింగం’గా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే మరోసారి వార్తల్లో నిలిచారు. 21 ఏళ్ల సర్వీసులో ఏకంగా 25 బదిలీలు ఎదుర్కొన్న ఆయన, కఠినమైన పరిపాలనా శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. యూపీఎస్‌సీలో ఆల్ ఇండియా 20వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే, వరుస తనిఖీలతో మరోసారి ఆయన వార్తల్లో వ్యక్తిగా మారారు.
మహారాష్ట్రలో స్ట్రిక్ట్‌గా, నిబంధనలకు కట్టుబడి పనిచేసే అధికారిగా గుర్తింపు పొందిన ఐఏఎస్ అధికారి తుకారాం ముండే మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయన.. ఆహార కల్తీ, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనల అమలులో రాజీ పడని వైఖరితో ఆయనకు ‘మహారాష్ట్ర సింగం’ అనే గుర్తింపు వచ్చింది.
తుకారాం ముండే 1975 జూన్ 3న మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలోని తడ్సోన్నా గ్రామంలో జన్మించారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పెరిగిన ఆయనకు చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి ఉండేది. తొలిదశలో జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యాభ్యాసం సాగించారు. ఆ తర్వాత ఔరంగాబాద్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరాఠ్వాడా యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ, పొలిటికల్ సైన్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆయన విద్యా ప్రస్థానంలో యూజీసీ-జేఆర్ఎఫ్/ఎన్‌ఈటీ వంటి అర్హతలు కూడా ఉన్నాయి.
2005 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారిగా విధుల్లోకి వచ్చిన ముండే.. ముస్సూరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో శిక్షణ పొందారు. 2011లో సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీలో సంక్షోభం, అత్యవసర పరిస్థితులు, విపత్తు నిర్వహణకు సంబంధించిన ప్రత్యేక కోర్సును కూడా పూర్తి చేశారు. తుకారాం ముండే తన 21 ఏళ్ల ఉద్యోగ వృతిలో 25 బదిలీలు ఎదుర్కొన్నారు. నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరించడం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వడం, నిర్ణయాల్లో రాజీపడకపోవడం ఆయన పని తీరుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.
2026 మే నెలలో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆహార భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలు, పంపిణీ సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. తుకారం ముండే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎఫ్‌డీఏ 1,100కు పైగా తనిఖీలు నిర్వహించడం విశేషం.
