Divya Mittal : మాజీ ఐఏఎస్ అధికారి దివ్యా మిట్టల్ సంచలన నిర్ణయం.. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన
Divya Mittal :ఇటీవల ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన దివ్యా మిట్టల్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని ఆమె స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని వెల్లడించారు.
Divya Mittal
Divya Mittal : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ దివ్యా మిట్టల్ ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత, కుటుంబ కారణాలతో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే, ఆమె రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించడంతో సెప్టెంబర్ 15న అమల్లోకి వచ్చింది. రాజీనామా తరువాత దివ్యా మిట్టల్ ఏం చేయబోతున్నారనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆమె రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.
Also Read : Neeru Dhanda : ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా.. మహిళల ట్రాప్ షూటింగ్లో భారత్‌కు గోల్డ్!
ఇటీవల ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన దివ్యా మిట్టల్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని ఆమె స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచే తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని వెల్లడించారు. ఈ మేరకు వీడియోను విడుదల చేశారు. కార్యాలయాలకు చేరని సామాన్య ప్రజల సమస్యలకు గొంతుకగా ఉండాలనుకుంటున్నట్లు చెప్పారు. జవాబుదారీతనం, న్యాయం, ప్రజల సమస్యల పరిష్కారం తన రాజకీయ ప్రయాణంలో ప్రధాన అంశాలుగా ఉంటాయని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, వంతెనలు, పాఠశాలలు వంటి మౌలిక సదుపాయాల విషయంలో ఎదురవుతున్న సమస్యలను ఆమె ప్రస్తావించారు. ప్రభుత్వ నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటి అమలులో జాప్యం జరగకుండా జవాబుదారీతనం ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు దివ్యా మిట్టల్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె ప్రస్తుతం ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానని ప్రకటించలేదు. ఉత్తరప్రదేశ్‌నే తన రాజకీయ ప్రయాణానికి వేదికగా ఎంచుకున్నానని, ప్రజలతో కలిసి పనిచేస్తానని మాత్రమే స్పష్టం చేశారు.
దివ్యా మిట్టల్ ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం బెంగళూరులో విద్యాభ్యాసం చేశారు. అనంతరం లండన్ లో ఉద్యోగం చేసిన ఆమె భారతదేశంకు తిరిగి వచ్చాక యూపీఎస్సీకి సిద్ధమై ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. యూపీలోని పలు జిల్లాల్లో వివిధ పరిపాలనా బాధ్యతలు ఆమె నిర్వహించారు.
