Twin Sisters : ఆధార్ వ్యవస్థకే చుక్కలు చూపించిన కవలలు.. వేలి గుర్తులు, ఐరిస్ సేమ్ టూ సేమ్.. చివరికి ఏం జరిగిందంటే!
Aadhaar Biometric Duplicate Twins : ఇద్దరూ కవలలే.. కానీ, వారి వేలిముద్రలు, ఐరిస్ దాదాపు ఒకేలా ఉండటంతో ఆధార్ సిస్టమ్ ఏకంగా ఒకరిని ‘డూప్లికేట్’గా గుర్తించింది. బోర్డు పరీక్షల రిజిస్ట్రేషన్ సమయంలో వెలుగుచూసిన ఈ అరుదైన ఘటన అధికారులనే ఆశ్చర్యానికి గురిచేసింది.
Aadhaar Biometric Duplicate Twins
Aadhaar Biometric Duplicate Twins : ఇద్దరూ కవలలే.. రూపంలోనే కాదు, వేలిముద్రలు, కంటి ఐరిస్లోనూ దాదాపు తేడా కనిపించలేదు..! ఒకరి ఆధార్ నమోదు చేయగానే.. మరొకరిని ఏకంగా ‘డూప్లికేట్’గా తిరస్కరించింది సిస్టమ్.. ఆధార్ సాంకేతిక వ్యవస్థకే సవాల్‌గా మారిన ఈ అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. బోర్డు పరీక్షల రిజిస్ట్రేషన్ సమయంలో బయటపడిన ఈ సమస్యతో విద్యార్థినుల కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. చివరికి అధికారుల జోక్యం, నాలుగు నెలల ప్రత్యేక పరిశీలన తర్వాత ఈ చిక్కు ఎలా వీడిందో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
Also Read : Gold-Silver Prices Today : బంగారం కొనేవాళ్లకు అదిరిపోయే శుభవార్త.. కుప్పకూలిన గోల్డ్ రేటు.. నేటి ధరలు ఇవే..
సాధారణంగా ఒకే రూపంతో కనిపించే కవల సోదరీమణుల మధ్య కూడా వేలిముద్రలు, కంటిపాప (ఐరిస్) ఆకృతిలో తేడాలు ఉంటాయి. అయితే, ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన పదో తరగతి విద్యార్థినులు ఖిజ్రా జుబేర్, తూబా జుబేర్ విషయంలో పరిస్థితి భిన్నంగా మారింది. వారి బయోమెట్రిక్ వివరాలు దాదాపు ఒకేలా ఉండటంతో ఆధార్ సాంకేతిక వ్యవస్థకే చిక్కు ఎదురైంది.
పదో తరగతి బోర్డు పరీక్షల రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు ఇద్దరు అక్కాచెల్లెళ్లు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ఒకరి వివరాలు సిస్టమ్‌లో నమోదైన వెంటనే.. రెండో విద్యార్థిని వివరాలను డూప్లికేట్‌గా గుర్తించి తిరస్కరించింది. ముఖ్యంగా వారి వేలిముద్రలు, ఐరిస్ నమూనాలు దాదాపు ఒకేలా ఉండటమే ఇందుకు కారణంగా అధికారులు గుర్తించారు. దీంతో ఇద్దరు విద్యార్థినుల బోర్డు పరీక్షల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. సమస్య పరిష్కారం కాకపోతే తమ పిల్లల విద్యా భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆ తరువాత రాంపూర్ జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించారు.
సమస్య తీవ్రతను గుర్తించిన జిల్లా యంత్రాంగం వెంటనే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించింది. అనంతరం సాంకేతిక నిపుణుల బృందం రంగంలోకి దిగింది. దాదాపు నాలుగు నెలల పాటు మాన్యువల్ వెరిఫికేషన్, ప్రత్యేక పరిశీలన నిర్వహించిన అధికారులు చివరకు సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. ప్రత్యేక విధానాన్ని అనుసరించి ఇద్దరు సోదరీమణులకు వేర్వేరు ఆధార్ గుర్తింపులు జారీ చేశారు. దీంతో బోర్డు పరీక్షల రిజిస్ట్రేషన్‌కు ఏర్పడిన అడ్డంకి తొలగిపోయింది. తమ కుమార్తెల ఆధార్ సమస్యను పరిష్కరించి విద్యా భవిష్యత్తుకు మార్గం సుగమం చేసిన అధికారులకు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
