మంగుళూరు: కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ సర్జికల్ స్ట్రేక్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. భారత్, పాకిస్తాన్ పై గడచిన 5 ఏళ్లలో 3సార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసిందని, అయితే తాను 2 ఘటనల గురించే మాట్లాడతానని రాజ్ నాధ్ సింగ్ అన్నారు. కర్ణాటకలో శనివారం జరిగిన బీజేపీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ‘‘గత ఐదేళ్లలో, మనం మూడు సార్లు సరిహద్దు దాటి వెళ్లాం. మనవాళ్లు విజయవంతంగా వైమానిక దాడులు నిర్వహించారు. అందులో రెండు సంఘటనలపై నేను చెబుతాను. మూడోదానిపై మాట్లాడను….’’ అని పేర్కొన్నారు. మూడో ‘వైమానిక దాడి’ గురించి తాను మాట్లాడబోనని రాజ్‌నాథ్ చెప్పినప్పుడు సభలో నవ్వులు పూయగా , కార్యకర్తలంతా కరతాళ ధ్వనులు చేశారు. 2016 ,2019 ల్లో జరిగిన సర్జికల్ దాడులు సక్సెస్ అయ్యాయని పేర్కోన్నారు. 2019 ఫిబ్రవరి 14 న జరిగిన సర్జికల్ దాడుల్లో ప్రపంచంలో అతిపెద్ద ఉగ్రవాద సంస్ధ జైషే మహమ్మద్ కు చెందిన ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం అయ్యాయని చెప్పారు.
యూరీ దాడికి ప్రతీకారంగా 2016 లో భారత దళాలు నియంత్రణ రేఖ వెంబడి చేసిన సర్జికల్ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు చనిపోయారని తెలిపారు. 2019 ఫిబ్రవరి లో పుల్వామా ఉగ్రదాడి జరిగిన 12 రోజుల తర్వాత భారత వైమానిక దళాలు పాకిస్తాన్ లోని బాలాకోట్ లో నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై దాడులు చేశాయని రాజ్ నాధ్ సింగ్ తెలిపారు. బాలాకోట్ సర్జికల్ దాడుల్లో ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయిందీ భారత వైమానిక దళం అధికారులు , కేంద్ర ప్రభుత్వం నేటికీ అధికారికంగా చెప్పనప్పటికీ సుమారు 300 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది.