చైనాలోని వుహాన్ నుంచి రెండో విమానం ఢిల్లీ చేరుకుంది. 323 మంది భారతీయులను అధికారులు చైనా నుంచి స్వదేశానికి తీసుకొచ్చారు.
చైనాలోని వుహాన్ నుంచి రెండో విమానం ఢిల్లీ చేరుకుంది. 323 మంది భారతీయులను అధికారులు చైనా నుంచి స్వదేశానికి తీసుకొచ్చారు. వారిని మానెసర్ క్యాంపుకు తరలిస్తున్నారు. తొలి విడతలో 324 మందిని తీసుకొచ్చిన అధికారులు…మానెసర్ క్యాంపుకు తరలించి వైద్య పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు భారత్ లో రెండో కరోనా కేసు నమోదు అయింది. కేరళలో మరో వ్యక్తి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. బాధితుడికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. భారత్ లో నమోదైన రెండు కేసులు కేరళలోనే గుర్తించడంతో భయం నెలకొంది.
వ్యాధి సోకకుండా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. స్వయంగా మంత్రి దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇటీవలే చైనా నుంచి వచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నారు. వారి శాంపిళ్లను పూణేకు పంపిస్తున్నారు. ఇంటి వద్దనే చికిత్స అందిస్తున్నారు. చైనా వచ్చిన విద్యార్థులే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనా దెబ్బకు గజగజ వణికిపోతున్నాయి. దాదాపు 20 దేశాలకు కరోనా వైరస్ పాకింది. చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలో మృత్యుఘోష వినిపిస్తోంది. డ్రాగన్ కంట్రీలో 304 మంది చనిపోయారు. తాజాగా ఫిలిప్పీన్స్ లో కరోనా వైరస్ సోకి ఒకరు మృతి చెందారు. కరోనా వైరస్ తో చైనా బయట చనిపోయిన తొలి వ్యక్తిగా గుర్తించారు.
చైనాను కరోనా కాటేస్తోంది. పడగ విప్పుతూ..ప్రజల ఊపిరి ఆపేస్తోంది. వుహాన్ నగరంలో బయటపడిన ఈ వైరస్ చైనా ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు మృతుల సంఖ్య పెరుగుతోంది. రోజు రోజుకు వైరస్ తీవ్రతరం అవుతోంది. దీనిని అరికట్టాలని చైనా ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ విఫలమౌతున్నాయి