అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం.. అబ్బాయిల సంఖ్య పెరిగిపోవడం.. పెళ్లి కాక ఎంతోమంది యువకులు బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. ఇటీవలికాలంలో పెళ్లి కావట్లేదని ఆత్మహత్య చేసుకుంటున్న యువకుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. సరైన సమయంలో పెళ్లికాకపోవడంతో ఇక పెళ్లి కాదనే ఆవేదనతో యువకులు చనిపోతున్నారు.
అయితే పెళ్లి కానీ ఓ యువకుడు తను చనిపోయేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఏకంగా ముఖ్యమంత్రికే లేఖ రాశాడు వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని పూణెకు చెందిన 35ఏళ్ల యువకుడు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కార్యాలయానికి తనకు పెళ్లి కావట్లేదని, ఇక పెళ్లి కాదని అనిపిస్తుందని, స్వచ్ఛంద మరణానికి అనుమతి ఇవ్వాలంటూ విచిత్ర వినతిపత్రం అందజేశాడు.
‘నేను నా తల్లిదండ్రులకు ఏమీ చేయలేనని అనిపిస్తోంది. నేను నా కెరియర్, పెళ్లి విషయంలో ఎంతో అసంతృప్తితో ఉన్నాను. అందుకే స్వచ్ఛందంగా చనిపోయేందుకు నాకు అనుమతి నివ్వండి’ అంటూ యువకుడు సీఎంఓ కార్యాలయానికి వినతి అందజేశాడు. లేఖను అందుకున్న సీఎంఓ కార్యాలయం స్థానిక పోలీసులకు సమాచారం అందివ్వగా.. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు యువకుడు క్షేమంగానే ఉన్నాడంటూ సీఎంఓకు సమాచారం అందించారు.
అతను తన 70 ఏళ్ల తల్లి, 80 ఏళ్ల తండ్రి గురించి లేఖలో రాశాడని, వారి కోసం ఏమీ చేయలేకపోతున్నాననే మనస్తాపంతో ఈ లేఖ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అతనికి కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు పోలీసులు తెలిపారు.