చావు దెబ్బ : జమ్మూ కాశ్మీర్‌లో భీకర ఎన్ కౌంటర్

  • Publish Date - September 29, 2019 / 01:22 AM IST

జమ్మూ కాశ్మీర్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చావుదెబ్బ తగిలింది. హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ ఒసామాను సైన్యం మట్టుబెట్టింది. భారీ ఆపరేషన్‌లో ఒసామాతో పాటు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. 9 గంటల పాటు సాగిన ఎన్‌కౌంటర్‌లో ఓ జవాను వీరమరణం పొందాడు. పుల్వామా తరహాలోనే దాడులకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం ఉదయం బటోటే ప్రాంతంలో మొదట ఓ బస్సును ఆపేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు.

అప్రమత్తమైన డ్రైవర్ బస్సు స్పీడ్ పెంచాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మిలటరీకి సమాచారం అందించారు. దీంతో బటోటే ప్రాంతంలో జవాన్లు భారీగా మోహరించారు. ఆ సమయంలో క్విక్ రియాక్షన్ టీమ్‌పై గ్రెనేడ్ దాడికి యత్నించగా.. సైన్యం తిప్పికొట్టింది. దీంతో ఉగ్రవాదులు రాంబన్‌‌లోని ఓ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో ఉన్నవారిని బంధీలుగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం భారత జవాన్లు ఆ ఇంటిని చుట్టుముట్టారు. లొంగిపోవాలని తొలుత హెచ్చరికలు జారీ చేసినా.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భారత సైన్యం కూడా కాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

ముష్కరుల కాల్పుల్లో రాజేందర్ సింగ్ జవాన్ వీరమరణం పొందాడు. గాందర్‌బల్‌ ప్రాంతంలో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ బలగాలు తనిఖీలు నిర్వహించాయి. టెర్రరిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతూ పారిపోయేందుకు యత్నించారు. భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. భారీగా ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని చూస్తుంటే భారీ కుట్రకే ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నట్లు బయటపడింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.
Read More : గుడ్ న్యూస్ : పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు