Lord Hanuman: 500 ఏళ్ల నాటి హనుమాన్‌ విగ్రహం.. ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు!

దశాబ్దం క్రితం దొంగిలించబడిన హనుమంతుడి విగ్రహం త్వరలో భారతదేశానికి తిరిగి రానుంది.

Hanuman

Lord Hanuman: దశాబ్దం క్రితం దొంగిలించబడిన హనుమంతుడి విగ్రహం త్వరలో భారతదేశానికి తిరిగి రానుంది. విజయనగర సామ్రాజ్య కాలంలో 14వ, 15వ శతాబ్దాల మధ్యలో 500ఏళ్లకు ముందు తయారైన హనుమాన్ విగ్రహం తిరిగి తమిళనాడు వెల్లూరు గ్రామంలోని వరదరాజా పెరుమాల్‌ గుడికి రానుంది. ఈ విగ్రహం తమిళనాడులోని అరియలూరు జిల్లా నుంచి విదేశాలకు అక్రమంగా తరలించబడింది. ఇటీవల ఆస్ట్రేలియాలోని ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి స్వాదీనం చేసుకున్నారు.

ఫిబ్రవరి 22న, ఆస్ట్రేలియన్ ఛార్జ్ డి’అఫైర్స్ మైఖేల్ గోల్డ్‌మాన్ దానిని కాన్‌బెర్రాలోని భారత హైకమీషనర్ మన్‌ప్రీత్ వోహ్రాకు అప్పగించారు. ఈ విగ్రహాన్ని 2012లో దొంగ‌లించగా.. 2014లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి వేలం ద్వారా 28 ల‌క్షల రూపాయ‌లకు సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తమిళనాడు పోలీసులు ఆస్ట్రేలియా అధికారులను సంప్రదించారు. దీంతో వారు ఆ విగ్రహాన్ని తమిళనాడుకు ఇవ్వబోతున్నారు.

ఈ హనుమాన్ విగ్రహంతో పాటు శ్రీదేవి విగ్రహం, భూదేవి విగ్రహం, అరియలూరు వెల్లూర్ గ్రామంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయం నుండి ఏప్రిల్ 9, 2012 న చోరీకి గురయ్యాయి. ఈ కేసు విషయంలో తమిళనాడు పోలీసు ఐడల్ వింగ్‌కు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సహకరించింది.