Lakhimpur : యూపీలో రైతుల ఆందోళన హింసాత్మకం..ఎనిమిది మంది మృతి

ఉత్తరప్రదేశ్‌ లోని లఖిమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలో ఇవాళ జరిగిన రైతుల నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

Lakhimpur ఉత్తరప్రదేశ్‌ లోని లఖిమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలో ఇవాళ జరిగిన రైతుల నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఆందోళనలో నలుగురు రైతులు సహా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడగా..వారిని ట్రీట్మెంట్ కోసం స్థానిక హాస్పిటల్ కు తరలించారు.

అసలేం జరిగింది
లఖిమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలోని  టికునియాలో కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రా, ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య  ఆదివారం ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే వీరి పర్యటనను వ్యతిరేకిస్తూ టికునియా-బందిర్పూర్ రోడ్డుపై రైతులు నల్లజెండాలతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి,డిప్యూటీ సీఎం ప్రయాణిస్తున్న కాన్వాయ్ రోడ్డు పక్కనే ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది.   రైతులు నిరసన వ్యక్తం చేస్తుండగా.. రెండు ఎస్​యూవీ వాహనాలు వారిని ఢీకొట్టాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. రైతులపై కాన్వాయ్ దూసుకెళ్లడాన్ని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ ఖండించారు.

కాగా, రైతులను తొక్కించుకుంటూ వెళ్లిన రెండు కార్లలోని ఓ కారుని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా తనయుడు ఆశీష్‌ మిశ్రా కారు నడుపుతున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. రైతులపైకి కారు ఎక్కించిన కేంద్ర మంత్రి కుమారుడిని అదుపులోకి తీసుకోవాలంటూ ఆందోళనకు దిగిన రైతులు పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. ఓ పోలీసు,ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కొట్టి చంపారు రైతులు.

విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌.. అదనపు డీజీపీ ప్రశాంత్‌కుమార్‌ను లఖిమ్‌పూర్‌ ఖేరీకి వెళ్లి పరిస్థితి సద్దుమణిగేలా చూడాలని ఆదేశించారు. పలువురు ఉన్నతాధికారులు లఖిమ్‌పూర్‌ ఖేరీలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు డీజీపీ ముకుల్‌ గోయల్‌ తెలిపారు. ఇక,పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.ఘటన ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు అధికార యంత్రాంగం.

అయితే ఈ ఘటనలో తమ తప్పు ఏమీ లేదని కేంద్ర సహాయమంత్రి అజయ్ మిశ్రా వివరణ ఇచ్చారు. రైతుల రాళ్ల దాడి కారణంగా తమ కారు తిరగబడిందని చెప్పారు. కారు కింద పడి ఇద్దరు చనిపోయారని చెప్పారు. ఘటన తర్వాత తమ కార్లకు నిప్పు పెట్టారని.. తమ డ్రైవర్,ముగ్గురు బీజేపీ కార్యకర్తలను రైతులు దారుణంగా కొట్టి చంపారని తెలిపారు. ఘటనా స్థలంలో తన కుమారుడు లేడని అజయ్ మిశ్రా చెప్పారు.

ALSO READ క్షీణించిన మహంత్ గోపాల్‌దాస్ ఆరోగ్యం..లక్నోకి తరలింపు

 

ట్రెండింగ్ వార్తలు