Rain in Delhi: ఢిల్లీలో భారీ వర్షం.. గోడ కూలి 8 మంది మృతి

ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి భారీగా నీరు చేరింది.

ఢిల్లీలోని హరినగర్‌లో భారీ వర్షం కారణంగా గోడ కూలిపోవడంతో 8 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఫైర్ డిపార్ట్‌మెంట్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 9.16 గంటలకు ఈ ఘటనపై కాల్ రావడంతో 3 ఫైర్ ట్రక్కులు పోలీస్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి.

మృతులను షబీబుల్‌ (30), రబీబుల్‌ (30), ముట్టు అలీ (45), రుబీనా (25), డాలీ (25), రుఖ్సానా (6), హసీనా (7)గా గుర్తించారు. మరొకరి గురించి తెలియాల్సి ఉంది. ఢిల్లీలో గతరాత్రి భారీ వర్షం కురవడంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి.

శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి శనివారం ఉదయం 8.30 గంటల వరకు ఢిల్లీలోని ప్రధాన వాతావరణ కేంద్రం సఫ్దర్‌జంగ్‌లో 78.7 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రగతి మైదాన్‌లో 100 మి.మీ., లోధి రోడ్‌లో 80 మి.మీ., పూసాలో 69 మి.మీ., పలం‌లో 31.8 మి.మీ. వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం ఉష్ణోగ్రత 23.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సగటు కన్నా 3.2 పాయింట్లు తక్కువ.

ఘాజీపూర్‌లో రోడ్లపై నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్, అజ్మీరి గేట్ సహా పాత ఢిల్లీలోని అనేక ప్రాంతాలు నీటమునిగిన పరిస్థితి కనపడుతోంది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల సెల్లార్లలోకి భారీగా నీరు చేరింది.