షాకింగ్…భారత్ లోని కరోనా బాధితుల్లో 83శాతం మంది 60ఏళ్ల లోపు వాళ్లే

భారత్ లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 3 వేల 500కి చేరువలో ఉంది. రానున్న రోజుల్లో భారత్‌లో కోవిడ్ బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 30 శాతం ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గత నెలలో మర్కజ్ బిల్డింగ్ లో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనవారివేనని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

అదేవిధంగా, అలాగే ఏ వయసు గల వారికి కరోనా వైరస్ ఎక్కువగా సోకుతుందనే విషయాన్ని కూడా కేంద్రం తెలిపింది. కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం దేశంలో కరోనా బారిన పడుతున్న వారిలో 83 శాతం మంది 60 ఏళ్లలోపు వారే. భారత్ లోని మొత్తం కరోనా బాధితుల్లో 20 ఏళ్లలోపు వారు 9 శాతం ఉండగా, 21-40 ఏళ్ల మధ్య వయస్సు గల వారు 42 శాతం ఉన్నారు. 41-60 ఏళ్ల మధ్య వయస్కులు 33 శాతం ఉండగా, 17 శాతం మంది 60 ఏళ్లు పైబడిన వారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ తెలిపారు. కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ల్లో 58 మంది పరిస్థితి విషమంగా ఉందని ఆయన తెలిపారు.

యువత కరోనా బారిన పడిన పడటమే కాదు.. తీవ్రంగా అనారోగ్యం పాలవడంతోపాటు మరణించే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే మరోవైపు ప్రపంచంలోని మిగతా దేశాల్లో వృద్ధులు ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడుతుండగా.. మన దేశంలో మాత్రం 60 శాతం బాధితులు 20 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న వారే కావడం గమనార్హం. యువత, మధ్యవయస్కులు ఎక్కువ కరోనా బారిన పడరనే భావన.. కేంద్రం విడుదల చేసిన గణాంకాలతో తప్పని తేలింది.