Sc8
Supreme Court సుప్రీంకోర్టులో కొత్త జడ్జీల నియామకానికి సంబంధించి సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సిఫార్సు చేసిన తొమ్మిది పేర్లను కేంద్రప్రభుత్వం ఇప్పటికే ఆమోదించగా…గురువారం తొమ్మిది పేర్లకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. దాంతో ఆగస్టు-31న ఈ తొమ్మిదిమంది సుప్రీంకోర్టు జడ్జిలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
అత్యున్నత న్యాయస్థానం సిఫార్సు చేసిన మొత్తం తొమ్మిది పేర్లను ప్రభుత్వం ఆమోదించడం ఇదే మొదటిసారి. సుప్రీంకోర్టులో మొత్తం 34 జడ్జి స్థానాలుండగా.. ప్రస్తుతం 25 మంది న్యాయమూర్తులను మాత్రమే సుప్రీంకోర్టు కలిగి ఉంది. కొత్త న్యాయమూర్తులు 9 మంది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుప్రీంకోర్టు ఒక ఖాళీ మాత్రమే మిగిలి ఉంటుంది.
సుప్రీంకోర్టు జడ్జిలుగా ఆగస్టు-31న ప్రమాణస్వీకారం చేయనున్న తొమ్మిదిమంది(ముగ్గురు మహిళలతో కలిపి)..జస్టిస్ ఏఎస్ ఒకా,విక్రమ్ నాథ్,జేకే మహేశ్వరి,హిమా కోహ్లీ,బీవీ నాగరత్న,సీటీ రవికుమార్,ఎమ్ఎమ్ సుంద్రేష్,బేలా త్రివేది, పీసీ నరసింహ ఉన్నారు.
హిమ కోహ్లీ.. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. బేలా త్రివేది.. గుజరాత్ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. విక్రమ్ నాథ్..గుజరాత్ హైకోర్టు చీఫ్ జస్టిగ్ గా ఉన్నారు. జె.కె మహేశ్వరీ..సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. అభయ్ ఓకా.. కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. బీవీ నాగరత్న..కర్ణాటక హైకోర్టు జడ్జిగా ఉన్నారు. సీటీ రవికుమార్..కేరళ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. ఎమ్ ఎమ్ సుంద్రేష్..మద్రాస్ హైకోర్టు జడ్జిగా ఉన్నారు. కాగా, పీసీ నరసింహ సుప్రీంకోర్టులో లాయర్ గా ఉన్నారు. పీఎస్ నరసింహ నియామకానికి కేంద్రప్రభుత్వం మరియు రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకి ఎంపికైన తొమ్మిదవ లాయర్ గా ఆయన నిలిచారు.
కాగా,సుప్రీంకోర్టులో జడ్జిలుగా బాధ్యతలు చేపట్టనున్నవారిలో ఒకరైన బీవీ నాగరత్న..2027లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశముంది. అదే జరిగితే భారత ప్రధాన తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె చరిత్ర సృష్టించనున్నారు. ఇక,పీసీ నరసింహ కూడా ప్రధాన న్యాయమూర్తి రేసులో ఉన్నారు. ఒకవేళ పీఎస్ నరసింహ గునక 2027లో సీజేఐ అయితే బార్ నుంచి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టే మూడవ లాయర్ గా పీఎస్ నరసింహ నిలుస్తారు.
1964లో బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన మొదటి లాయర్ గా జస్టిస్ ఏఎమ్ సిక్రి నిలిచారు. 1971లో ఏఎమ్ సిక్రీ భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఇక,లాయర్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన జస్టిస్ LU లలిత్..వచ్చే ఏడాది ఆగస్టులో ఎన్వీ రమణ పదవీ విరమణ తర్వాత సీజేఐగా బాధ్యతలు చేపట్టడానికి ఎక్కువ అవకాశాలున్నాయి.