Mayur Vihar phase : ఫ్లై ఓవర్ కింద పాఠాలు, యువకుల వినూత్న ప్రయోగం

ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ 1 ఫ్లై ఓవర్ వద్ద మురికివాడల్లో నివాసం ఉండే చిన్న పిల్లలకు చదువు చెబుతున్నారు.

Schools

School Set Up Under Flyover : చదువు..ఎంతో ముఖ్యమైంది. భావితరాలకు చదువు అందించాలనే ఉద్దేశ్యంతో ఎంతో మంది ప్రయత్నాలు చేస్తుంటారు. విద్యాబుద్ధులు రాకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో అందరికీ తెలిసిందే. చాలా మంది చదువుకు దూరంగా ఉన్నారు. కడు పేదరికంతో పాటు కొన్ని కారణాల వల్ల పిల్లలకు చదువు చెప్పించడంలో తల్లిదండ్రులు విఫలమౌతుంటారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ వైరస్ కారణంగా…ఎన్నో రంగాలు అతలాకుతలమవుతున్నాయి. ప్రధానంగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు మూతపడ్డాయి.

గత సంవత్సరం స్కూల్స్ తెరవకపోవడం వల్ల పరీక్షలు జరుగలేదు. పరీక్షలు జరుగకుండానే..వారిని పై తరగతులకు పంపించారు. కొన్ని పరీక్షలు జరిగినా..ప్రస్తుతం కరోనా వేగంగా విస్తరిస్తుండడంతో మరోసారి స్కూళ్లకు, పాఠశాలలు మూతపడ్డాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే..స్లమ్ ఏరియాలో నివాసం ఉండే పేదలు చదువుకు గత కొన్ని నెలలుగా దూరంగా ఉన్నారు. వీరికి చదువు చెప్పాలని కొంతమంది యువకులు నడుం బిగించారు.

ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ 1 ఫ్లై ఓవర్ వద్ద మురికివాడల్లో నివాసం ఉండే చిన్న పిల్లలకు చదువు చెబుతున్నారు. ఓ బోర్డును ఏర్పాటు చేసి చదువు చెబుతున్నారు. తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందన వస్తోంది. ఫ్లై ఓవర్ కింద నిర్వహిస్తున్న ఈ స్కూల్ కు పిల్లలను పంపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వీరు ఇలా చదువు చెబుతున్నారు. కోవిడ్ కారణంగా..స్కూళ్లు మూతపడడంతో తాము చదువులు చెప్పడం జరుగుతోందని ఓ యువ టీచర్ దీపక్ వెల్లడించారు. ప్రస్తుతం 250 మందికి చదువు చెబుతున్నామని, నర్సరీ నుంచి కేజీ – 10వ తరగతి వరకు చదువు చెప్పడం జరుగుతోందన్నారు. ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు మాత్రమే క్లాసులు నిర్వహిస్తామని, వర్షకాలంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, షెల్టర్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా వీరు చదువు చెబుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. యువకులు చేస్తున్న ప్రయత్నాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.